అంతర్జాతీయ
-బొమ్మ శివకుమార్
ఇరాన్ పై అగ్రరాజ్యం అమెరికా ఏ క్షణమైనా దాడులు చేయవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ ను అణు ఒప్పందం చేసుకోవాలని ఒత్తిడి పెంచుతున్నారు. ఈ మేరకు 15 రోజుల అల్టిమేటం ఇటీవల జారీ చేయబడింది. దానితోపాటు ఇరాన్ సమీపంలో అత్యాధునిక యుద్ధనౌకలు, యుద్ధ విమానాలను మోహరిస్తున్నారు. ఈ కీలక సమయంలో అమెరికా సైన్యానికి ఓ పెద్ద సమస్య వచ్చింది. అదే టాయిలెట్ల కొరత..
అమెరికాకు చెందిన అత్యంత ఖరీదైన, అత్యాధునిక విమాన వాహక నౌకగా ‘USS జెరాల్డ్ ఆర్. ఫోర్డ్’ కు పేరుంది. ప్రస్తుతం ఈ యుద్ధనౌక ఇరాన్ సమీపంలో అరేబియా సముద్రంలో ఉంది. గతనెలలో వెనిజులాపై అమెరికా సైన్యం దాడుల్లో ఈ నౌక కీలక పాత్ర పోషించింది. ఆ దాడిలో అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన భార్యను బంధించిన విషయం తెలిసిందే. అయితే ఇరాన్ తో అమెరికా యుద్ధానికి సిద్ధం అవుతున్న అమెరికా ఇప్పుడు ఈ భారీ యుద్ధనౌకలో టాయిలెట్ల సమస్య సైన్యాన్ని వేధిస్తోంది.
ఈ భారీ యుద్ధనౌకలో సుమారు 4,500 మంది నావికులు ఉంటారు. అయితే టాయిలెట్లు సరిగ్గా పనిచేయడం లేదు.. ఒక టాయిలెట్ వాడాలంటే నావికులు దాదాపు 45 నిమిషాల పాటు క్యూలో నిలబడాల్సి వస్తోందని పలు నివేదికల ద్వారా స్పష్టం అవుతోంది. దాదాపు 333 మీటర్ల పొడవు గల ఈ నౌక, 75కు పైగా యుద్ధ విమానాలను మోసుకెళ్లగలదు. RIM-162 సీస్పారో, RIM-116 మిస్సైల్స్‌తో పాటు ఫలాంక్స్, Mk 38 మెషిన్ గన్‌లు అత్యాధునికమైన ఆయుధాలు ఈ యుద్ధనౌకలో సిద్ధంగా ఉన్నాయి.
అయితే ఈ యుద్ధనౌకలో సాంకేతక సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నౌకలో నీటిని నిల్వ చేయడానికి క్రూయిజ్ షిప్స్‌లో ఉండే విధంగా అధునాతన ‘వ్యాక్యూమ్ సీవరేజ్ సిస్టమ్’ ను ఏర్పాటు చేశారు. అయితే ఇందులోని పైపులు చాలా సన్నగా ఉండటం వల్ల తరచూ జామ్ అవుతున్నాయి. ఒక్క చోట అడ్డుపడినా.. ఆ వరుసలో ఉన్న టాయిలెట్లన్నీ పనిచేయడం ఆగిపోతున్నట్లు సమాచారం. ఇక తాత్కాలిక పరిష్కారం పైపులను యాసిడ్ ఫ్లష్ తో శుభ్రం చేస్తున్నారు.

ప్రతిసారి $400,000 డాలర్లు ఖర్చవుతోంది. 2023 నుండి కనీసం 10 సార్లు ఇలా జరిగింది. ఈ యుద్ధ నౌక ఆగినప్పుడు మాత్రమే యాసిడ్ ఫ్లష్ చేయగలరు. ఇది ప్రస్తుతానికి సాధ్యం కాదు. ఈ సమస్య సిబ్బంది మధ్య ఉద్రిక్తతలు పెంచింది. టాయిలెట్లను టీ-షర్టులు, తాడు ముక్కలు వంటి అసాధారణ వస్తువులతో మూసివేస్తున్నారని మురుగునీటి నిర్వహణ సిబ్బంది సైనికులను ఆరోపిస్తున్నారు.

