seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 8:51 pm Digital Edition : SEEMA KIRANAM

వెల్దుర్తి  ఎంపీటీసీ, వార్డు రిజర్వేషన్లలో ఎస్సీలకు మొండిచేయి!

వెల్దుర్తి  ఎంపీటీసీ, వార్డు రిజర్వేషన్లలో ఎస్సీలకు మొండిచేయి!

 

 

30 ఏళ్లుగా వస్తున్న రిజర్వేషన్‌ ఈసారి ఎందుకు రాలేదు?

 

 

ఎస్సీలకు న్యాయం చేయాలి.. లేకపోతే ఉద్యమం తప్పదు

 

 

ఎమ్మార్పీఎస్ నాయకులు నాయకంటి గిడ్డయ్య, నాయకంటి హరి 

 

 

 

కర్నూలు ప్రతినిధి నజీర్, అక్టోబర్ 14 (సీమకిరణం న్యూస్):

 

 

స్థానిక ఎంపీటీసీ మరియు వార్డు సభ్యుల ఎన్నికల రిజర్వేషన్ల కేటాయింపులో ఎస్సీలకు అవకాశం కల్పించకపోవడంపై ఎమ్మార్పీఎస్ నాయకులు నాయకంటి గిడ్డయ్య, నాయకంటి హరి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం వెల్దుర్తిలో విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నాయకంటి గిడ్డయ్య, నాయకంటి హరి మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఎస్సీ రిజర్వేషన్‌ వస్తూ ఉండగా, ఈసారి మాత్రం రిజర్వేషన్‌ కేటాయించకపోవడానికి గల కారణాలను అధికారులు వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. వెల్దుర్తి పట్టణంలో ఎస్సీ జనాభా సుమారు 30 శాతం ఉన్నప్పటికీ, ఈసారి ఎస్సీలకు రిజర్వేషన్‌ దక్కకపోవడం అన్యాయమని వారు ఆరోపించారు.

 

 

ఓటర్ల గణాంకాలను పరిగణనలోకి తీసుకోవాలి

 

 

ఎమ్మార్పీఎస్ నాయకులు నాయకంటి గిడ్డయ్య, నాయకంటి హరి అందించిన వివరాల ప్రకారం, వెల్దుర్తిలో మొత్తం ఓటర్లు సుమారు 14,000 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఎస్సీ ఓటర్లు 4,000, ఎస్టీ ఓటర్లు 500, బీసీ ఓటర్లు 6,000, మైనారిటీ ఓటర్లు 2,500, ఓసీ ఓటర్లు 1,000 మంది ఉన్నట్లు వివరించారు.ఈ గణాంకాలను పరిగణనలోకి తీసుకొని రిజర్వేషన్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించాలని నాయకులు కోరారు. గతంలో కొనసాగుతూ వచ్చిన ఎస్సీ రిజర్వేషన్‌ ఈసారి ఎందుకు కేటాయించలేదో సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 

 

రిజర్వేషన్లను పునఃసమీక్షించాలి

 

 

వెల్దుర్తి ఎంపీటీసీ రిజర్వేషన్‌ కేటాయింపును సంబంధిత అధికారులు పునఃసమీక్షించి, ఎస్సీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని నాయకంటి గిడ్డయ్య, నాయకంటి హరి కోరారు. ఎస్సీలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం, అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. తమ అభ్యంతరాలను అధికారులు పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఆందోళనలు, ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఎస్సీలకు న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వెల్దుర్తికి చెందిన ఎస్సీ నాయకులు ప్రసాద్, రాజేష్, సూరి, పెద్ద హరి, సూర్యచంద్ర, శేఖర్, అయ్యన్న, మోహన్ రాజు, మాధవ, కృష్ణ, ఎల్లస్వామి, నాగమద్ది తదితరులు పాల్గొన్నారు.