ఆంధ్ర ప్రదేశ్
ఓయి-లింగారెడ్డి గజ్జల
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు సామాన్య ప్రయాణికులను విస్మయానికి గురిచేస్తున్నాయి. ప్రయాణ ప్రాంగణాలు కాస్త ‘ప్రేమాయణ’ వేదికలుగా మారడం, శ్రుతి మించిన శృంగారం పక్కన ఉన్నవారిని ఇబ్బంది పెట్టడం ఒక ఎత్తయితే.. ఇప్పుడు ఏకంగా డ్రైవర్ల మీద దాడులకు దిగుతుండటం కలకలం రేపుతోంది. మచిలీపట్నంలో వెలుగులోకి వచ్చిన ఈ తాజా ఘటన ‘ప్రేమ జంటలు’ ఎంతలా రెచ్చిపోతున్నారో కళ్ళకు కడుతోంది.
హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఓ ప్రేమజంట మచిలీపట్నం వెళ్లేందుకు ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సులో టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే, ప్రైవేట్ ట్రావెల్స్‌లో ఉన్న నిబంధనలను బురిడీ కొట్టడానికి పక్కపక్కనే ఉన్న రెండు సీట్లను ఇద్దరు అమ్మాయిల పేర్లతో రిజర్వ్ చేశారు. ఎక్కిన తర్వాత సీన్ కట్ చేస్తే.. అక్కడ ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పక్కపక్కనే పడుకోవడానికి సిద్ధమయ్యారు.

డ్రైవర్ అభ్యంతరం – Lovers ఆవేశం!
టికెట్ చెకింగ్ సమయంలో ఇది గమనించిన డ్రైవర్.. “ఐడీ కార్డుల ప్రకారం ఇద్దరు అమ్మాయిలు ఉండాలి కదా, అబ్బాయిని ఎలా అనుమతించాలి?” అని ప్రశ్నించాడు. కంపెనీ నిబంధనల ప్రకారం వేరే జెండర్ వ్యక్తులు పక్కపక్కనే పడుకోవడం కుదరదని స్పష్టం చేశాడు. దీంతో ఆ ప్రేమజంటకు అహం దెబ్బతిన్నట్టుంది. నిబంధనలు పాటించమని చెప్పినందుకు డ్రైవర్‌తో వీరవేశంతో గొడవకు దిగారు. తోటి ప్రయాణికులు నచ్చజెప్పడంతో అప్పటికి సైలెంట్ అయ్యారు కానీ, మనసులో మాత్రం పగ పెంచుకున్నారు.
ప్రియురాలు రెచ్చగొట్టింది.. ప్రియుడు రెచ్చిపోయాడు!
ప్రయాణం ముగిసి మచిలీపట్నం బస్టాండ్ సెంటర్ రాగానే ఆ యువతి తన ప్రియుడిని ఉసిగొల్పింది. “మమ్మల్ని పక్కపక్కన కూర్చోనివ్వకుండా అడ్డుకున్న ఆ డ్రైవర్‌ని వదలొద్దు” అంటూ రెచ్చగొట్టడంతో, యువకుడు ఊగిపోయాడు. చిలకలపూడి సెంటర్‌కు చేరుకోగానే.. బస్సు డ్రైవర్‌పై అకస్మాత్తుగా దాడికి దిగాడు. బాధ్యతగా తన పని తాను చేసుకుంటున్న డ్రైవర్‌ను విచక్షణారహితంగా కొట్టడంతో అతనికి గాయాలయ్యాయి.
పోలీస్ కేసు.. సోషల్ మీడియాలో ఆగ్రహం!
గాయపడిన డ్రైవర్ వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో, ఆ యువకుడిపై కేసు నమోదైంది. ఈ వార్తతో నెటిజన్లు తీవ్రంగా కనిపిస్తున్నారు. “ప్రైవేట్ బస్సులు ఓయో రూమ్స్ లాగా మారుతున్నాయి.. సంస్కారం లేకుండా ప్రవర్తించడమే కాకుండా, బాధ్యత గల డ్రైవర్లపై దాడులు చేయడం ఏంటి?” అంటూ మండిపడుతున్నారు.
మచిలీపట్నం వీధుల్లో ఇప్పుడు ఈ ‘లవర్స్ లొల్లి’ పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రయాణాల్లో పద్ధతిగా ఉండాల్సిన యువత, ఇలాంటి దాడులకు దిగడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

