ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
విశాఖ కేంద్రంగా గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటులో వరుస నిర్ణయాలు జరుగుతున్నాయి. తాజా గా జరిగిన కేబినెట్ సమావేశంలో డేటా సెంటర్ పైన చర్చ జరిగింది. ఇప్పటికే గూగుల్ రాసిన లేఖ పైన ప్రభుత్వం సమీక్షించింది. గూగుల్ డేటా సెంటర్ నిర్మాణ, నిర్వహణ బాధ్యతలను అదానీ సంస్థ చూసుకోనుందని గూగుల్ లేఖ రాసిన నేపథ్యంలో… భూముల యాజమాన్య హక్కులతో పాటు నిర్వహణనూ అప్పగించాలన్న ప్రతిపాదనలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. అదానీ పెట్టిన షరతులపై పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది.
విశాఖలో గూగుల్ సంస్థ రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో ఒక గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. కాగా, ప్రభుత్వం ఈ డేటా సెంటర్ ఏర్పాటును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ డేటా సెంటర్ ఏర్పాటులో అదానీని తమ భాగస్వామిగా నిలిపూ గూగుల్ రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాసింది. భవిష్యత్తులో అదానీతోనే లావాదేవీలు నిర్వహించుకోవాలని సూచించింది.

ఈ తరుణంలోనే గూగుల్ డేటా సెంటర్‌కు ఇచ్చిన ప్రోత్సాహకాలు తమకు బదలాయించుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి అదానీ లేఖ రాసింది. దీనిని తీసుకున్న మంత్రివర్గం.. ఇప్పటికే విశాఖలో గూగుల్‌కు కేటాయించిన 480 ఎకరాలతోపాటు మరో 170 ఎకరాలు కేటాయించాలని తీర్మానించినట్లు తెలుస్తోంది. అదానీ ప్రతిపాదించిన మిగిలిన వస్తువులను పరిశీలించి త్వరలోనే తీసుకునే అవకాశం ఉంది.
ఇదే సమయంలో విశాఖ కేంద్రంగా మరో దిగ్గజ కంపెనీ కొలువు తీరనుంది. ఐటీ దిగ్గజ కంపెనీ ఐబీఎం మళ్లీ విశాఖపట్నంలో కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించింది. అందుకు అవసరమైన భూమి కోసం అన్వేషిస్తోంది. రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటమ్ వ్యాలీలోనూ ఐబీఎం కీలకంగా వ్యవహరిస్తోంది. విశాఖలో కూడా ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకు గాను భూమిని కేటాయించాలని కోరింది. ఈ నేపథ్యంలో విశాఖలో అనువైన ప్రదేశాన్ని చూడటానికి ఐబీఎం ప్రతినిధులు కూడా ఉన్నారు. సుమారు 20 ఎకరాలు కోరుతున్నట్టు సమాచారం.
కాగా.. ఐబీఎం 2011లోనే విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. రుషికొండ ఐటీ హిల్ నంబర్ 3పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కెనెక్సా ఐటీ కంపెనీకి 25 ఎకరాలు కేటాయించారు. ఆ సంస్థ కొన్నాళ్లు నడిపి ఆ తర్వాత దాన్ని ఐబీఎంకు విక్రయించింది. అయితే.. తరువాత చోటు చేసుకున్న వరుస పరిణామాలతో విశాఖలో తమ సెంటర్ మూసివేసింది. ఇక.. రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో ఓ కార్యాలయం ఏర్పాటు చేస్తోంది.

