అంతర్జాతీయ
ఓయి-లింగారెడ్డి గజ్జల
సాధారణంగా సోషల్ మీడియాలో కంపెనీలపై వచ్చే పోస్టులు ఎలా ఉంటాయి? “వర్క్ ప్రెషర్ ఎక్కువ”, “ఉద్యోగులను విలువ చేయడం లేదు”, “కల్చర్ బాగోలేదు” వంటి విమర్శలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఈసారి కథ పూర్తిగా భిన్నంగా ఉంది. ఒక కంపెనీ తీసుకున్న నిర్ణయం ఉద్యోగులనే కాదు… నెటిజన్లను కూడా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే, కృతజ్ఞతను మాటల్లో కాదు – బంగారంతో వ్యక్తం చేసింది.
సింగపూర్‌కు చెందిన చాంగ్ చెంగ్ హోల్డింగ్స్ తమ 32వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సంస్థలో పదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులను ప్రత్యేకంగా సత్కరించింది. 999 స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసిన మెమెంటోలను బహుమతిగా అందించి గౌరవించింది. ఒక్కో మెమెంటో 20 నుంచి 30 గ్రాముల బరువుతో ఉండగా, ఒక్కదాని విలువ సుమారు మూడు లక్షల రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా.

20 గ్రాముల బంగారం..
సేవా కాలాన్ని ఆధారంగా తీసుకుని బహుమతుల బరువును నిర్ణయించారు. 10 నుంచి 14 సంవత్సరాలు పనిచేసిన వారికి 20 గ్రాముల బంగారం, 15 నుంచి 19 సంవత్సరాలు పూర్తిచేసిన వారికి 25 గ్రాములు, 20 ఏళ్లకు పైగా సేవలు అందించిన వారికి 30 గ్రామాలకు గోల్డ్ మెమెంటో అందజేశారు. ప్రతి మెలోపై కంపెనీ లోగో, ప్రధాన కార్యాలయ రూపురేఖలు, ఉద్యోగి సేవా సంవత్సరాలు చెక్కబడ్డాయి. వీటిని ప్రత్యేక ఎరుపు గిఫ్ట్ బాక్సుల్లో అందించింది, సరఫరా బాధ్యతను SK జ్యువెలరీ నిర్వర్తించింది.
సోషల్ మీడియాలో వైరల్..
ఈ వేడుకను కూడా అట్టహాసంగా నిర్వహించారు. 100కి పైగా టేబుళ్లతో ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమంలో ఒక్కొక్కరిని వేదికపైకి ఆహ్వానించి గౌరవించారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.
మొత్తం బహుమతుల విలువ సుమారు 500,000 సింగపూర్ డాలర్లు, అంటే దాదాపు రూ.3.5 కోట్లు. ఇది కేవలం ఖర్చు కాదు… ఉద్యోగుల పట్ల ఉన్న గౌరవానికి చిహ్నమని సంస్థ వ్యవస్థాపకుడు మాత్రమే తెలిపారు.
రైస్ స్టాల్‌గా ప్రారంభమై..
1994లో చిన్న చైనీస్ వెజిటబుల్ రైస్ స్టాల్‌గా ప్రారంభమైన ఈ సంస్థ, నేడు 160కి రెస్టారెంట్లు, 30కి పైగా కాఫీ షాపులు నడుపుతూ 1,200 మందికి పైగా ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తోంది. ఈ ప్రయాణంలో ఉద్యోగుల బలమని గుర్తించి, వారికి బంగారంతో కృతజ్ఞత తెలిపిన తీరు ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తోంది.
కంపెనీ లాభాలు పెరగడం ఒక విజయం అయితే… ఆ విజయాన్ని నిర్మించిన చేతులను గౌరవించడం నిజమైన విజయం అని ఈ సంఘటన చెబుతోంది

