తెలంగాణ
ఓయ్-బొమ్మ శివకుమార్
తన పేరుతో ఎలాంటి సంస్థలు లేవని.. తన పేరుతో సంస్థలను స్థాపించి కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతులు లేవని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.’కేటీఆర్ సేవా సమితి’, ‘కేటీఆర్ సేన’ వంటి పేర్లతో సంస్థలను ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అలాంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని..ఆ సంస్థలకు ఎటువంటి అధికారిక గుర్తింపు లేదని కేటీఆర్ తెలిపారు.
ఎవరైనా సామాజిక, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటే. తనపై అభిమానం ఉన్నవారు నేరుగా పార్టీతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. కొంతమంది ‘కేటీఆర్ సేవా సమితి’, ‘కేటీఆర్ సేన’ లాంటి పేర్లతో సంస్థలను ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిసిన నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు.

మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆరోపణలు చేశారు. తెలంగాణను ఏఐసీసీకి ఏటీఎంలా మార్చారని కేటీఆర్ ధ్వజమెత్తారు. రెండేళ్లుగా తాము అనేకసార్లు ఈ విషయంపై హెచ్చరించామని.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి నిస్సిగ్గుగా ఒప్పుకున్నారని ఎక్స్’ వేదికగా కేటీఆర్ పోస్టు పెట్టారు. రాష్ట్ర సంపదను కాంగ్రెస్ అధిష్ఠానానికి ధారపోస్తూ.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారు కేటీఆర్ ఫైర్ అయ్యారు. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన 420 హామీల అమలుతోపాటు అభివృద్ధి పనులకూ ప్రభుత్వం వద్ద రూపాయి నిధుల్లేవంటూ సాకులు చెబుతున్నారు.

