భారతదేశం
-డాక్టర్ వీణా శ్రీనివాస్
ప్రపంచవ్యాప్తంగా ఏఐ అన్ని రంగాలలోనూ శరవేగంగా తన సత్తాను చాటుతోంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో, విస్తరణతో ఉద్యోగాలు తగ్గిపోతాయి అనే భయం ఎప్పటినుంచో అందరిలోనూ ఉంది. అయితే తాజాగా అటువంటి ఆందోళనను ప్రముఖ బిలియనీర్, వెంచర్ క్యాపిటలిస్ట్ వినోద్ ఖోస్లా మరోసారి ప్రస్తావించారు.
వచ్చే ఐదేళ్ళలో కనుమరుగయ్యే ఉద్యోగాలు ఇవే
భారతదేశంలో త్వరలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ నేపథ్యంలో ఆయన ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఆయన వచ్చే ఐదేళ్లలో కనుమరుగయ్యే ఉద్యోగాల గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.రానున్న ఐదేళ్లలో ఐటీ సేవలు, బీపీఓలు దాదాపు కనుమరుగుకానున్నాయని ఖోస్లా అభిప్రాయం వ్యక్తం చేశారు.

15 ఏళ్ళలో ఆ వృత్తులు కనుమరుగు
అలాగే, సుమారు 15 ఏళ్లలో నైపుణ్యం కలిగిన వృత్తులు కూడా తుడిచిపెట్టుకుపోతాయని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ ప్లేస్ ని రీప్లేస్ చేస్తుందని ఆయన హెచ్చరించారు. అయితే, ఈ పరిణామం వల్ల విద్య, వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి రావడం సాధ్యమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్మికుల స్థానంలో రోబోలు
వినోద్ ఖోస్లా మాట్లాడుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం చూపింది. ఆ ప్రభావం ఎక్కువగా ఉద్యోగాల పైనే ఉంటుంది. కార్మికుల స్థానంలో రోబోలు పనిచేస్తాయని, కార్మికుల కంటే రోబోలకు ఖర్చు చేసే ఖర్చు చాలా తక్కువగా ఉండటంతో ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ఇక ఇదే సమయంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని అన్నారు.
విద్య, వైద్యం అందరికీ అందుబాటులో ఉంది
రానున్న 15 నుంచి 20 ఏళ్లలో చాలావరకు దేశంలో ప్రజలకు అందే సేవలు ఉచితంగా కావొచ్చు. విద్య, అందరికీ అందుబాటులోకి వస్తుంది అని తెలియజేసారు.మనుషులు ఉద్యోగాల కోసం చదవడం, ప్రభుత్వాలు ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టడం భవిష్యత్తులో సరైన ఆలోచన కాకపోగా ఖోస్లా అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఏఐ, మనుషులు కలిసి పనిచేసే కాలం వస్తుంది
పలు వృత్తులను ఏఐ మరింత మెరుగ్గా చేయగలదు. కాబట్టి.. ఏఐ, మనుషులు పనిచేసే కాలం వస్తుందని తాను భావిస్తున్నట్టుగా ఉంది. ఇక భారత్ సేవల విషయంలో కాకుండా, ఏఐ ఆధారిత ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశంగా అవతరిస్తుంది అని ఆయన అభిప్రాయపడ్డారు.

