తెలంగాణ
ఓయ్-సాయి చైతన్య
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా నిధుల ముహూర్తం ఖరారు చేసింది. రైతు భరోసా నిధుల పైన కొంత కాలంగా జరుగుతున్న చర్చలకు స్పష్టత ఇచ్చింది. ఎలాంటి కోతలు లేకుండా గత వానాకాలం సీజన్లో రైతు భరోసా చెల్లించిన రైతులందరి కీ యాసంగిలోనూ రైతు భరోసా పెట్టుబడి సాయం అందనుంది. ఎలాంటి కోతలు లేకుండా గడిచిన పంటకాలంలో లబ్ధిదారులుగా ఉన్న రైతులకు ఈసారి కూడా రైతుభరోసా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాటిలైట్ సర్వేతో లింకు పెట్టకుండానే రైతు భరోసా పంపిణీకి కసరత్తు చేస్తోంది.
రైతు భరోసా నిధుల జమ పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మునిసిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియగానే కొత్త రైతుల నమోదుకు అవకాశం కల్పించింది.. ఆ వెంటనే వారికి నగదు బదిలీ చేయవలసి వచ్చింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 ఖరీఫ్ సీజన్లో 69,39,548 మంది రైతులకు ఎకరానికి రూ.6 వేల చొప్పున రూ.8,744.13 కోట్ల రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేశారు. మొత్తం 1,45,73,000 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చారు. కేవలం 9 రోజుల వ్యవధిలో సుమారు రూ.9 వేల కోట్లు రైతులకు పంపిణీ చేశారు. ఆ లెక్క ప్రకారమే యాసంగికి రైతు భరోసా ఉంటుంది. ఈ రోజు పదో తేదీనే భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి రూ.9 వేల కోట్ల రుణం తీసుకుంది. ఈ రైతు భరోసాకే కేటాయించినట్లు. మునిసిపల్ ఎన్నికల ప్రక్రియ ఈ నెల 16వ తేదీతో దాదాపుగా ముగిసిపోతుంది. ఆ వెంటనే ఎన్నికల కోడ్ తరువాత రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు.

గత సీజన్ లో వారికి యథాతథంగా అమలు
వాస్తవానికి సంక్రాంతికే ప్రభుత్వం రైతు భరోసా చెల్లిస్తుందని భావించారు. నిధుల సర్దుబాటు, ముసిపల్ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. ఈ నెలలోనే రైతు భరోసా చెల్లింపులు పూర్తి చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా చెల్లింపులకు మార్గం సుగమం అవుతున్న నేపథ్యంలో కొత్త రైతుల నమోదు అంశం తెరపైకి వచ్చింది. గత వానాకాలంలో రైతుభరోసా పంపిణీ చేసిన తర్వాత.. జరిగిన భూముల క్రయవిక్రయాలు, కొత్త రైతులకు జారీ చేసిన పట్టా పాస్ పుస్తకాలను యాసంగికి చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే.. క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవసాయ విస్తరణాధికారులు కొత్త రైతుల నమోదు, ధ్రువ పత్రాల స్వీకరణ చేపడతారు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. గత ఏడాది జనవరి ఒకటో తేదీని కటాఫ్ తేదీగా తీసుకున్నారు. ఈ సారి ఏ తేదీ తీసుకుంటారనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే.. శాటిలైట్ సర్వే ఆధారంగా రైతు భరోసా అమలు చేసే అవకాశం లేదని తెలుస్తోంది. గత వానా మాదిరి సుమారు 1.46 కోట్ల ఎకరాలకు రైతు భరోసా పంపిణీకి తుది కసరత్తు జరుగుతోంది.

