Saturday, March 7, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్రైతులు తప్పనిసరిగా పంట మార్పిడి పద్ధతిని అనుసరించాలి 

రైతులు తప్పనిసరిగా పంట మార్పిడి పద్ధతిని అనుసరించాలి 

📰 Generate e-Paper Clip

రైతులు తప్పనిసరిగా పంట మార్పిడి పద్ధతిని అనుసరించాలి 

 

శాస్త్రవేత్త డాక్టర్ కె. రాఘవేంద్ర  

 

రైతులతో శాస్త్రవేత్తల ముఖాముఖి – మిరప, వేరుశనగ పంటలపై అవగాహన కార్యక్రమం

 

వెల్దుర్తి , ఫిబ్రవరి 07, (సీమకిరణం న్యూస్) (రిపోర్టర్ : యస్.నూర్ భాష) :

 

వెల్దుర్తి మండలం రామళ్లకోట గ్రామంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో రైతులతో శాస్త్రవేత్తల ముఖాముఖి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల వ్యవసాయ అధికారి ఆర్. అక్బర్ భాషా ముఖ్య పాత్ర పోషిస్తూ రైతులకు పలు కీలక సూచనలు అందించారు. ఈ సందర్భంగా కేవీకే, బనవాసి కార్యక్రమ సమన్వయకర్త మరియు శాస్త్రవేత్త డాక్టర్ కె. రాఘవేంద్ర మిరప పంట సాగులో రైతులు ఎదుర్కొంటున్న రసం పీల్చే పురుగులు, వైరస్ తెగుళ్ల నియంత్రణపై విస్తృతంగా అవగాహన కల్పించారు. మిరప పంటను అనువైన సమయంలోనే నాటాలని, అధిక ఉష్ణోగ్రతల సమయంలో సాగు చేయవద్దని సూచించారు. అలాగే పంట కోత పూర్తైన తరువాత ప్రతి రైతు లోతు దుక్కులు చేయడం అవసరమని తెలిపారు. వేరుశనగ పంటకు పూత దశలో ఎకరానికి 200 కిలోల చొప్పున జిప్సం వాడాలని సూచించారు. జిప్సం వాడడం వల్ల గింజలో నూనె శాతం పెరిగి దిగుబడి గణనీయంగా పెరుగుతుందని వివరించారు. రైతులు తప్పనిసరిగా పంట మార్పిడి పద్ధతిని అనుసరించాలని సూచించారు. సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా లింగాకర్షణ బుట్టలు, జిగురు అట్టలు, వేప నూనె పిచికారీ వంటి పద్ధతులను పాటించడం ద్వారా చీడపీడలను నియంత్రించవచ్చని తెలిపారు. ఉద్యాన పంటలైన మిరప, అరటి పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా వివరణ ఇచ్చారు. ఉద్యానవనాధికారి నరేష్ కుమార్ రెడ్డి పూలు, పండ్లు, కూరగాయల పంటలకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వివరాలను రైతులకు తెలియజేశారు. వ్యవసాయ శాఖ ద్వారా ఎఫ్‌ఎంఎస్ పథకం కింద ఉచితంగా పంపిణీ చేసిన వేరుశనగ విశిష్ట రకం (టీ సీ జీ యస్–1694) పంట పొలాలను పరిశీలించగా, రైతులు దిగుబడి ఆశాజనకంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో మండల వ్యవసాయ అధికారి ఆర్. అక్బర్ భాషా ముందుండి సమన్వయం చేసి రైతులకు ఉపయోగకరమైన మార్గదర్శకత్వం అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె. రాఘవేంద్ర శాస్త్రవేత్త, కేవీకే బనవాసి ఆర్. అక్బర్ భాషా మండల వ్యవసాయ అధికారి, వెల్దుర్తి నరేష్ కుమార్ రెడ్డి ఉద్యానవనాధికారి, వెల్దుర్తి వ్యవసాయ విస్తరణ అధికారులు అజయ్ భార్గవ్, సంధ్యా రాణి, ఉదయ్ రైతు సేవా కేంద్రం సిబ్బంది తనూజ మరియు రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular