అంతర్జాతీయ
ఓయ్-జక్కీ మహేష్
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ముఖ్యంగా కీలకమైన హార్ముజ్ జలసంధి మూతపడటంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. అయితే ఈ సంక్షోభం రష్యా దేశానికి మాత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ యుద్ధం కారణంగా ప్రతిరోజూ దాదాపు రూ.1250 కోట్లు అదనపు ఆదాయాన్ని గడుపుతోంది.
రష్యాకు వరంగా మారిన యుద్ధం?
ఇరాన్ తన పరిధిలోని హార్ముజ్ జలసంధి గుండా ఓడల రాకపోకలను నిలిపివేయడంతో ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు కోటి బ్యారెళ్ల కొరత ఏర్పడింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటేశాయి. ఈ పెరిగిన ధరలు రష్యా ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతాన్ని ఇస్తున్నాయి. పెరిగిన ధరల వల్ల రష్యాకు రోజుకు సుమారు 150 మిలియన్ డాలర్లు (రూ.1250 కోట్లు) అదనపు ఆదాయం వస్తోంది. ప్రస్తుతం రష్యా ఇంధన విక్రయాల ద్వారా రోజుకు 550 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపాదిస్తోంది. ఇది యుద్ధం మొదలవ్వకముందు కంటే 14 శాతం ఎక్కువ. రష్యా బడ్జెట్‌లో ముడిచమురు ధరను 59 డాలర్లుగా అంచనా వేయగా.. ప్రస్తుతం రష్యా ‘యూరల్ క్రూడ్’ ధర 62 డాలర్లకు చేరింది.

భారత్, చైనా నుంచి పెరిగిన డిమాండ్
మిడిల్ ఈస్ట్‌లో సరఫరా నిలిచిపోవడంతో భారత్, చైనా వంటి పెద్ద దిగుమతి దేశాలు తమ ఇంధన అవసరాల కోసం రష్యా వైపు మొగ్గు చూపుతున్నాయి. గతంలో అమ్ముడుపోకుండా ట్యాంకర్లలో ఉండిపోయిన సుమారు 3.2 కోట్ల బ్యారెళ్ల రష్యా చమురు కొనుగోలుదారులు వేగంగా కొనేశారు. చైనాకు చెందిన ప్రభుత్వ సంస్థలు వచ్చే వేసవి వరకు రష్యా నుంచి రాయితీ ధరకే చమురు పొందేలా భారీ ఒప్పందాలు చేసుకుంటున్నాయి.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యుద్ధ సెగ
ఒకవైపు రష్యాకు లాభాలు వస్తున్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా సామాన్యుడిపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. చమురు ధరల పెరుగుదల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ రికార్డు స్థాయిలో 92.49కి పడిపోయింది. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం వాటా ఉన్న హార్ముజ్ మార్గం మూతపడటం ప్రపంచ సరఫరా గొలుసును దెబ్బతీస్తోంది. ఇరాన్ యుద్ధాన్ని ఆపడానికి అమెరికా ప్రయత్నిస్తుండగా.. రష్యా మాత్రం ఈ పరిస్థితిని తన ఆర్థిక ప్రయోజనాల కోసం వాడుకుంటోంది. ట్రంప్ ప్రభుత్వం ఈ పరిస్థితి ఎలా ఎదుర్కుంటుందో చూడాలి.

