అంతర్జాతీయ
ఓయి-లింగారెడ్డి గజ్జల
చరిత్ర పుటల్లో ఫిబ్రవరి 28, 2026 ఒక రక్తసిక్తమైన దినంగా మిగిలిపోనుంది. ఇజ్రాయెల్, అమెరికా మరియు ఇరాన్ మధ్య రేగిన యుద్ధ జ్వాలలు అమాయక ప్రాణాలను బలితీసుకుంటున్న తీరు కంటతడి పెట్టిస్తోంది. యుద్ధం అంటే కేవలం దేశాల మధ్య గొడవ కాదు, కొన్ని వందల కుటుంబాల ఆశల సమాధి అని ఈనాటి ఘటనలు మరోసారి నిరూపిస్తున్నాయి.
దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ నగరం.. శనివారం ఉదయం వరకు ఆ పాఠశాల విద్యార్థినుల కేరింతలతో సందడిగా ఉంది. కానీ, ఒక్కసారిగా ఆకాశం నుండి ఊడిపడ్డ మృత్యుపాశం (మిస్సైల్) ఆ ఆనందాన్ని ఆవిరి చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడిలో బాలికల పాఠశాల లక్ష్యంగా మారింది. నిమిషాల వ్యవధిలో భవనం కుప్పకూలింది. పుస్తకాలు పట్టుకోవాల్సిన ఆ పసి చేతులు ప్రాణాలు కాపాడుకోవడానికి గాలిని తడమాల్సి వచ్చింది. ఈ ఘోరకలిలో 36 మంది విద్యార్థులు అక్కడికక్కడే మరణించారని ఇరాన్ వార్తా సంస్థ IRNA. విగతజీవులుగా పడి ఉన్న ఆ చిన్నారి దేహాలను చూసి యావత్ ప్రపంచం మూగబోయింది.

ముసురుతున్న చీకట్లు.. మినాబ్ లో రక్తపుటేరులు..
యుద్ధం ఇక్కడితో ఆగలేదు. ఇరాన్ గుండెకాయ వంటి రాజధాని టెహ్రాన్ నగరం పేలుళ్ల మోతతో దద్దరిల్లింది. సుప్రీం లీడర్ అయతొల్ల అలీ ఖమేనీ కార్యాలయాలకు సమీపంలోనే క్షిపణులు పడటంతో అక్కడ భయానక వాతావరణం కనిపించింది. ఆకాశమంతా కమ్ముకున్న నల్లటి పొగ.. ప్రజల ఆర్తనాదాలు.. ఎటు చూసినా విధ్వంసమే! ఇరాన్ గడ్డపై మరణాల లెక్క మొదలైంది, కానీ అది ఎక్కడితో ఆగుతుందో ఎవరికీ తెలియదు.
మినాబ్, హోర్మ్జ్గాన్, ఇరాన్ స్కూల్లో 24 మంది విద్యార్థినులు చనిపోయారు pic.twitter.com/98i7oBkYXq
— రూమి ☫ 🔴 (@RumiHomi) ఫిబ్రవరి 28, 2026
ప్రతీకారేచ్ఛతో రగిలిన ఇరాన్
తమ దేశంపై జరిగిన దాడికి ఇరాన్ వెనువెంటనే స్పందించింది. తమ బిడ్డల రక్తం చిందిన చోటే ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటన. నిమిషాల వ్యవధిలోనే వందలాది డ్రోన్లు, క్షిపణులు ఇజ్రాయెల్ వైపు దూసుకెళ్లాయి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఉత్తర ఇజ్రాయెల్ ఒక్కసారిగా సైరన్ల మోతతో ఉలిక్కిపడింది.
ఎర్రబడిన హోమ్ ఫ్రంట్ యాప్..
ఇజ్రాయెల్ పౌరుల చేతుల్లో ఉన్న ‘హోమ్ ఫ్రంట్ కమాండ్ యాప్’ ఒక్కసారిగా రక్తవర్ణంలోకి (రెడ్ కలర్) మారిపోయింది. అది కేవలం ఒక హెచ్చరిక కాదు.. మృత్యువు ముంగిట ఉందన్న సంకేతం. ప్రతి ఒక్కరూ బాంబు దుకాణాలకు పరుగెత్తాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలు (ఐరన్ డోమ్) ఆ క్షిపణులను అడ్డుకుంటున్నా, ఆకాశంలో జరుగుతున్న ఆ భీకర పోరాటం చూసి సామాన్యులు వణికిపోతున్నారు.
అధికారం కోసం పాలకులు చేసే యుద్ధాలకు బలిపీఠం ఎక్కుతోంది మాత్రం సామాన్యులే. అటు ఇరాన్ లోని పాఠశాలలో ప్రాణాలు కోల్పోయిన ఆ 36 మంది బాలికలు, ఇటు క్షిపణుల భయంతో బిక్కుబిక్కుమంటున్న ఇజ్రాయెల్ పౌరులు.. వీరందరిదీ ఒక్కటే వేదన. మనిషి సృష్టించిన ఈ యుద్ధ తంత్రం ముందు మానవత్వం ఓడిపోతోంది. ఈ రక్తపాతం ఎప్పుడు ముగుస్తుందో.. ఆ పసిపిల్లల తల్లిదండ్రుల గర్భశోకం ఎవరు తీరుస్తారో కాలమే చెప్పాలి.

