seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 2:56 pm Digital Edition : SEEMA KIRANAM

తప్పుడు వివరాలు సమర్పించిన ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవు

క్యాడర్ల కేటాయింపు ప్రక్రియను మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలి

 

కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

 

కర్నూలు ప్రతినిధి, జూలై 17, (సీమకిరణం న్యూస్) :

 

స్థానిక క్యాడర్ల కేటాయింపు ప్రక్రియను మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ 2025 ప్రకారం జారీ చేయబడిన డ్రాఫ్ట్ జీవో ప్రకారం సిబ్బంది కేటాయింపుకు సంబంధించిన ప్రిపరేటరీ వర్క్ పై కలెక్టర్ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫైనల్ జిఓ ఇంకా రాలేదని, డ్రాఫ్ట్ జీవో ప్రకారం స్థానిక క్యాడర్లకు ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను మొత్తం 7 దశల్లో నిర్వహించనున్నారన్నారు. మొదటి దశలో క్యాడర్ స్ట్రెంగ్త్, డ్రాఫ్ట్ సీనియారిటీ జాబితాల పరిశీలన చేపట్టి, లీవ్, డెప్యుటేషన్, సస్పెన్షన్, ప్రొబేషన్, ట్రైనింగ్, అనధికార గైర్హాజరులో ఉన్న ఉద్యోగుల వివరాలను కూడా చేర్చనున్నారన్నారు. డ్రాఫ్ట్ సీనియారిటీ జాబితా కేటాయింపుల కోసమే ఉపయోగించబడుతుందని, తప్పుడు వివరాలు సమర్పించిన ఉద్యోగులపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. రెండో దశలో డ్రాఫ్ట్ సీనియారిటీ జాబితాను ప్రచురించి, అభ్యంతరాల స్వీకరణకు 5 రోజుల గడువు ఇవ్వనున్నారన్నారు. ఇదే సమయంలో ఉద్యోగులు తమ ఆప్షన్ ఫారమ్‌లను సమర్పించాల్సి ఉండగా, ఒకసారి ఇచ్చిన ఆప్షన్‌ను తరువాత మార్చుకునే అవకాశం ఉండదని కలెక్టర్ తెలిపారు. మూడో దశలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్–2025 ప్రకారం ఫైనల్ క్యాడర్ స్ట్రెంగ్త్, వర్కింగ్ స్ట్రెంగ్త్ ఆధారంగా స్థానిక క్యాడర్లకు కేటాయింపులు చేపడతారన్నారు. వితంతువులు, తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్న ఉద్యోగులు, అనారోగ్యంతో ఉన్న పిల్లలు గల ఉద్యోగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, ఎస్సీ ఉపవర్గీకరణ మరియు ఎస్టీ ఉద్యోగులకు నిష్పత్తి ఆధారంగా కేటాయింపులు అమలు చేయనున్నట్లు డ్రాఫ్ట్ జీవోలో పేర్కొన్నారన్నారు. డ్రాఫ్ట్ జీవో ప్రకారం, ఉద్యోగులకు స్థానిక క్యాడర్ కేటాయింపు అనంతరం బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి 7 రోజులలోపు సంబంధిత స్థానంలో తప్పనిసరిగా విధుల్లో చేరాల్సి ఉంటుందన్నారు. స్పౌస్ (భార్యాభర్తలు) కేసుల్లో ఉద్యోగులు విధుల్లో చేరిన అనంతరం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఖాళీల లభ్యత (Subject to Vacancy) ఆధారంగా వారి అభ్యర్థనలను పరిశీలిస్తారన్నారు. అయితే స్పౌస్ కేసులపై బదిలీ పొందిన ఉద్యోగులు సంబంధిత క్యాడర్‌లో తమ సీనియారిటీని వదులుకోవాల్సి ఉంటుందని, అక్కడ ఇప్పటికే ఉన్న రెగ్యులర్ ఉద్యోగుల జాబితాలో చివరన చేర్చబడతారని కలెక్టర్ వివరించారు. స్థానిక క్యాడర్ కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందని భావించే ఉద్యోగులు సంబంధిత ప్రభుత్వ శాఖ కార్యదర్శికి (Secretary to Government) బదిలీ ఉత్తర్వులు అందిన తేదీ నుంచి 7 రోజులలోపు అప్పీల్ దాఖలు చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్నది డ్రాఫ్ట్ జీవో మాత్రమేనని, తుది (ఫైనల్) జీవో విడుదలైన తర్వాత అందులోని నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపడతామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు, ఉద్యోగులు జీవో నెం.46, జీవో నెం.54లను పూర్తిగా అధ్యయనం చేసి, సందేహాలు ఉంటే శాఖాధిపతులు లేదా సంబంధిత అధికారులను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. తుది జీవో విడుదలైన వెంటనే సంబంధిత గ్రూపుల ద్వారా అందరికీ పంపిణీ చేస్తామని కలెక్టర్ తెలిపారు.. వీడియో కాన్ఫరెన్స్ లో కర్నూలు డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, నంద్యాల డిఆర్ఓ రాము నాయక్, కలెక్టరేట్ ఏఓ రవి కుమార్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.