తెలంగాణ
ఓయ్-చంద్రశేఖర్ రావు
హైదరాబాద్ ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తీపికబురు వినిపించింది. నగరం మొత్తం అన్ని సిటీలను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుతోంది. దీనికి సంబంధించిన ఓ బృహత్తర ప్రణాళికను ప్రకటించారు. డీజిల్ ఉద్గారాలను తొలగించడం, ప్రజా రవాణాను ఆధునీకరించడం, డీజిల్ స్థానంలో ఎలక్ట్రిక్ సిటీ బస్సులను అందుబాటులోకి తీసుకురావడానికి ఉద్దేశించిన ప్రణాళిక ఇది.
కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుతో పాటు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని డీజిల్ బస్సులను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుతోంది. రెట్రోఫిట్టింగ్ కార్యాచరణను అమలు చేస్తోంది టీజీఎస్‌ఆర్టీసీ. వేల సంఖ్యలో డీజిల్లను విద్యుత్ వాహనాలుగా మార్చే రెట్రోఫిట్టింగ్ ను అమలు చేసిన మొదటి రోడ్డు రవాణా సంస్థ ఇదే. పాత డీజిల్లన్నీ కూడా ఇక్కడ ఈవీలుగా రూపాంతరం చెందుతున్నాయి.

పైలెట్ ప్రాజెక్ట్ గా ఈ కార్యక్రమం విజయవంతమైంది. రెట్రోఫిట్‌మెంట్ కోసం టెండర్లను గత ఏడాది సెప్టెంబర్ 15న ఆహ్వానించారు. 240 బస్సుల రెట్రోఫిట్‌మెంట్ కాంట్రాక్ట్‌ను టీజీఎస్‌ఆర్టీసీ రెండు సంస్థలకు అప్పగించింది. ఇందులో ‘సాయి గ్రీన్ మొబిలిటీ’కి 200 బస్సులు, ‘కళ్యాణి పవర్‌ట్రైన్ లిమిటెడ్’కు 40 బస్సులు కేటాయించారు. ఈ ప్రణాళికలో భాగంగా మొత్తం 19 డిపోలలో ఛార్జింగ్ సౌకర్యాలు అభివృద్ధి చేయబడుతున్నాయి.
అలాగే 10 కొత్త డిపోలు, 10 కొత్త ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. దాదాపు 392 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. 2023లో ముషీరాబాద్ డిపోకు చెందిన ఒక డీజిల్ బస్సుకు ప్రైవేట్ కంపెనీ సహకారంతో విజయవంతంగా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్పు చేశారు. ఈ రెట్రోఫిట్ చేసిన బస్సు ప్రస్తుతం ఉప్పల్ డిపో స్థాయిలో నడుస్తోంది.
ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో ఆరు డిపోలలో 500 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. 2028 నాటికి అన్ని సిటీ బస్సులను కూడా ఈవీలుగా మార్చనుంది. దీనికోసం టీజీఎస్ఆర్టీసీ, తెలంగాణ సదరన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఓ సంయుక్త పవర్ కార్యాచరణ ప్రణాళికను కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా 392 కోట్ల రూపాయల పెట్టుబడితో సదరన్ డిస్కమ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది. హైదరాబాద్ సిటీ బస్సులను ఈవీలుగా మారిన తర్వాత వాటిని నడిపేందుకు 124 మెగావాట్ల విద్యుత్ అవసరం.

