ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సయ్యద్ అహ్మద్
<!--
--> <!-- -->వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కి హిందు ధర్మంపై విశ్వాసం లేదని సాధు సంఘాలు (సాధు పరిషత్) మండిపడ్డాయి. వైసీపీలో జగన్ రెడ్డి నుంచి వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వరకు అందరూ కూడా దుర్మార్గులేనని ధ్వజమెత్తారు. వాళ్లు చేసిన తప్పులను ఒప్పుకోకుండా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారని వారిలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదని బెజవాడలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాస నంద సరస్వతి మాట్లాడుతూ ‘గత ప్రభుత్వంలో అనేక సందర్భాల్లో టీటీడీల్లో అక్రమాలు బయటపడ్డాయని, 151 సీట్ల నుంచి 11 సీట్లు దిగజారిపోయిన వారికి ఇంకా బుద్ధి రావడం లేదని చెప్పారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని రసాయనాలతో తయారు చేసి మహాపరాధానికి పాల్పడ్డారని, ఇది క్షమించరాని నేరమన్నారు. దేవుడు తప్పనిసరిగా బాధ్యులను కఠినంగా శిక్షిస్తారనే నమ్మకం. కచ్చితంగా ఇదంతా జగన్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగింది, ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో చాలా దేవాలయాల మీద దాడులు జరిగాయి.

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జరిగిన అపచారంపై యావత్ హిందూ సమాజం రగిలిపోతోందని, ఈ ఘోరానికి ఒడిగట్టిన దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టకూడదని అమరావతి శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూ విషయంలో ఆధారాలతో సహా నిజాలు బయటపడినా, తప్పు చేసిన వారు సిగ్గుచేటని గుర్తించారు. రాజకీయ పార్టీలు, పదవులతో సంబంధం లేకుండా, గత ప్రభుత్వ హయాంలో ఈ అపచారానికి కారణమైన ప్రతి ఒక్కరినీ తక్షణమే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రపంచవ్యాప్తంగా కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి ఉన్నారని, రూపాలను బట్టి దేవుని నామం మారుతుందని రమణ జ్యోతి స్వామిజీ అన్నారు. దేవునికి అపచారం జరగడం మొదటిసారి కాదని, రాముడి తల నరికారు, వెండి సింహాలు దొంగతనం చేశారు, శాసనాలు పోవడం వంటి ఘటనలు జరిగాయని గుర్తుచేశారు. ముందు చిన్న చిన్న తప్పులు చేసి పరిశీలన చేసిన తర్వాతే ఈ కల్తీ నెయ్యి వాడారని ఆయన చెప్పారు. వైసీపీ హయంలో అసలు నెయ్యి లేకుండా తిరుపతిలో లడ్డులు తయారు చేశారు. సుమారు 20 కోట్ల లడ్డులు తయారు చేసి.. 100 కోట్ల మందికి పంచిపెట్టారు. వైసీపీ పార్టీ మొదటి నుంచి హిందువుల మనోభావాలు దెబ్బతీయాలని చూస్తుంది..