సైబర్ బాధితులకు ‘ఎంఆర్‌ఎం’ పోర్టల్ వరం
ఎఫ్‌ఐఆర్ లేకుండానే రూ.50 వేల వరకు నగదు రికవరీకి అవకాశం
సైబర్ మోసం జరిగిన వెంటనే 1930కు ఫోన్ చేయాలి
కర్నూలు నాల్గవ పట్టణ సీఐ విక్రమ్ సింహా
కర్నూలు ప్రతినిధి, సెప్టెంబర్ 05, (సీమకిరణం న్యూస్) :
సైబర్ మోసాలకు గురై కష్టార్జితాన్ని కోల్పోయిన బాధితులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంఆర్‌ఎం (MRM) పోర్టల్ ఒక వరంలా ఉపయోగపడుతోందని కర్నూలు నాల్గవ పట్టణ సీఐ విక్రమ్ సింహా తెలిపారు. సైబర్ నేరాలకు గురైన బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, నిర్ణీత విధానంలో ఆన్‌లైన్ ద్వారా తమ ఫిర్యాదును నమోదు చేసి నగదు రికవరీకి ప్రయత్నించవచ్చని ఆయన వివరించారు. సైబర్ నేరాల బాధితులకు అవగాహన కల్పిస్తూ సీఐ విక్రమ్ సింహా పలు కీలక సూచనలు చేశారు. సైబర్ మోసం జరిగిన వెంటనే ఆలస్యం చేయకుండా బాధితులు 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.
ఫిర్యాదు నమోదు ప్రక్రియ ఇలా…
తక్షణ స్పందన:
సైబర్ మోసం జరిగిన వెంటనే బాధితులు 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి జరిగిన మోసంపై ఫిర్యాదు చేయాలి.
అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్:
ఫిర్యాదు నమోదు అయిన అనంతరం బాధితుడి మొబైల్ ఫోన్‌కు ఒక అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ అందుతుంది.
వెబ్‌సైట్‌లో నమోదు:
అనంతరం mrm-ncrp.mha.gov.in పోర్టల్‌లోకి వెళ్లి, అందిన అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్‌తో అవసరమైన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
వివరాల సమర్పణ:
బాధితుని పేరుపై ఉన్న బ్యాంకు ఖాతా వివరాలు, పాన్ కార్డు, మొబైల్ నంబర్ తదితర వివరాలను నమోదు చేసి, ఓటీపీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని సీఐ వివరించారు.
ఎఫ్‌ఐఆర్ లేకుండానే రూ.50 వేల వరకు రికవరీ అవకాశం
పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం లేకుండానే, రూ.50 వేల లోపు సైబర్ మోసంలో పోగొట్టుకున్న నగదును నిర్ణీత ప్రక్రియ ద్వారా రికవరీ చేసుకునే అవకాశం ఉందని సీఐ విక్రమ్ సింహా తెలిపారు. సైబర్ మోసానికి గురైన వెంటనే బాధితులు ఎంత వేగంగా స్పందిస్తే, నగదు తిరిగి పొందే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. ఆలస్యం చేయకుండా వెంటనే 1930కు ఫోన్ చేసి, అనంతరం పోర్టల్‌లో పూర్తి వివరాలను నమోదు చేయాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడిన బాధితులందరూ కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు నాల్గవ పట్టణ సీఐ విక్రమ్ సింహా కోరారు.