శాశ్వత హైకోర్టు బెంచ్ కోసం కర్నూలులో న్యాయవాదుల భారీ ర్యాలీ
కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 20, (సీమకిరణం న్యూస్):

కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఏపీ హైకోర్టు సర్క్యూట్ బెంచ్ లేదా మొబైల్ బెంచ్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ భారీ మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కోర్టు నుంచి ప్రధాన రహదారి, పాత బస్‌స్టాండ్, కొండారెడ్డి కోట మీదుగా రాజవిహార్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. రాజవిహార్ సర్కిల్ వద్ద న్యాయవాదులు రోడ్డుపై బైఠాయించి రోడ్డురోకో నిర్వహించారు. “సర్క్యూట్ లేదా మొబైల్ హైకోర్టు బెంచ్ వద్దు.. శాశ్వత బెంచ్ మాత్రమే కావాలి” అంటూ నినాదాలు చేశారు. కర్నూలుకు చెందిన ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయవాది, రాయలసీమ అడ్వకేట్స్ జేఏసీ కన్వీనర్ వై. జయరాజు మాట్లాడుతూ.. సర్క్యూట్ లేదా మొబైల్ బెంచ్ ఏర్పాటుపై వస్తున్న వదంతుల నేపథ్యంలో ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, సంకీర్ణ భాగస్వాములు ఇచ్చిన శాశ్వత హైకోర్టు బెంచ్ హామీని ఎలాంటి జాప్యం లేకుండా అమలు చేయాలని కోరారు. ఆందోళన కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులకు జయరాజు క్షమాపణలు తెలిపారు. ఆందోళనకు సహకరించిన ప్రజలకు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. చంద్రుడు మాట్లాడుతూ.. తమ డిమాండ్‌ను ప్రభుత్వం నెరవేర్చకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ర్యాలీలో సీనియర్ న్యాయవాదులు ఎ. శివరామయ్య, ఎ.ఆర్.ఎస్. రెడ్డి, సి. నాగేంద్రనాథ్, కపిలేశ్వరయ్యతో పాటు కేడీబీఎస్ కార్యవర్గ సభ్యులు, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు.