seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 12:39 pm Digital Edition : SEEMA KIRANAM

శబ్ద కాలుష్యంపై కర్నూలు ట్రాఫిక్ పోలీసుల కొరడా

శబ్ద కాలుష్యంపై ట్రాఫిక్ పోలీసుల కొరడా

 

55 వాహనాలపై ఈ-చలాన్లు.. మోడిఫైడ్ సైలెన్సర్లు, హారన్లు తొలగింపు

 

కర్నూలు క్రైమ్, ఆగస్టు 24 (సీమకిరణం న్యూస్): 

కర్నూలు నగరంలో శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో సోమవారం ఓల్డ్ పీసీఆర్ సర్కిల్ పరిసర ప్రాంతాల్లో వాహనాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో అధిక శబ్దం చేసే మోడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తున్న ఐదు ద్విచక్ర వాహనాలను గుర్తించిన పోలీసులు వాటి సైలెన్సర్లను తొలగించి స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దం చేసే హారన్లను వినియోగిస్తున్న 50 ఆటోలను గుర్తించి, వాటి హారన్లను తొలగించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన మొత్తం 55 వాహనాలపై ఎంవీఐ చట్టం ప్రకారం ఈ-చలాన్లు విధించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ మాట్లాడుతూ పాఠశాలలు, ఆసుపత్రులు, నివాస ప్రాంతాల్లో అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బందులు కలిగించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మోడిఫైడ్ సైలెన్సర్లు, అధిక శబ్దం చేసే హారన్లను వినియోగించకుండా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.