ఆరోగ్య సమాజ నిర్మాణమే లక్ష్యం కావాలి..!
హార్ట్ ఫౌండేషన్ సేవలు మరింత విస్తరించాలి
మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
వైద్య సేవల్లో హార్ట్ ఫౌండేషన్‌ది ప్రత్యేక ముద్ర..!
2002 నుంచి వైద్య అవగాహన సదస్సులు, ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ
సూపర్ స్పెషాలిటీ వైద్యులకు ఏటా ‘అవుట్‌స్టాండింగ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డే కార్యక్రమం.. డా. ప్రసాద్ లాల్‌కు అవార్డు
వరల్డ్ హార్ట్ డే పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
కర్నూలు వైద్యం, సెప్టెంబర్ 21, (సీమకిరణం న్యూస్):
పాతికేళ్లుగా కర్నూలులో వైద్యరంగానికి విశేష సేవలందిస్తూ, అనేక వైద్య సదస్సులు, వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న కర్నూలు హార్ట్ ఫౌండేషన్ తన సేవలను మరింత విస్తృతం చేయాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ సూచించారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా రూపొందించిన ప్రత్యేక పోస్టర్‌ను ఆయన తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. “వైద్యో నారాయణో హరి” అన్న సూక్తిని నిజం చేసేలా హార్ట్ ఫౌండేషన్ సరికొత్త ఆలోచనలతో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సమాజంలోని ప్రతి వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని, అప్పుడే ఆరోగ్యవంతమైన, బలమైన సమాజం నిర్మాణమవుతుందని అన్నారు. డా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్, హార్ట్ ఫౌండేషన్ కార్యదర్శి డా. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. 2002లో ప్రారంభించిన హార్ట్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు అనేక వైద్య అవగాహన సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. పోలీసు సిబ్బంది, పాత్రికేయులు, మున్సిపల్ ఉద్యోగుల కోసం పలుమార్లు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించామని చెప్పారు. వివిధ వైద్య విభాగాల్లో విశిష్ట సేవలందించిన సూపర్ స్పెషాలిటీ వైద్యులను ప్రోత్సహించే ఉద్దేశంతో 2005 నుంచి ప్రతి ఏడాది వరల్డ్ హార్ట్ డే సందర్భంగా తమ సంస్థ ఆధ్వర్యంలో “అవుట్ స్టాండింగ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్” అవార్డును అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ 29న కర్నూలు హెల్త్ క్లబ్‌లో నిర్వహించనున్న వరల్డ్ హార్ట్ డే కార్యక్రమంలో విశాఖపట్నంకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. ప్రసాద్ లాల్‌కు ఈ అవార్డును టీజీ వెంకటేష్ చేతుల మీదుగా అందించనున్నట్లు డా. చంద్రశేఖర్ వెల్లడించారు. టీజీ వెంకటేష్ అందిస్తున్న సహాయ, సహకారాలతోనే కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఈ స్థాయికి చేరుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు మెడికల్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ డా. భవాని ప్రసాద్, హార్ట్ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు నాగేశ్వరబాబు, సుస్వరం వాసు తదితరులు పాల్గొన్నారు.