మూడు దశాబ్దాల ప్రజాసేవను గుర్తించి అవకాశం కల్పించాలని కోరిన జ్ఞానేశ్వర్ గౌడ్
వెల్దుర్తి, నజీర్, నవంబర్ 11 (సీమకిరణం న్యూస్):
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా ఎల్.ఈ. పుష్పావతి పోటీ చేయనున్నట్లు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ ఎల్.ఈ. జ్ఞానేశ్వర్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు వెల్దుర్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా తమ కుటుంబం గ్రామ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తోందని తెలిపారు. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతుగా ఎల్లప్పుడూ ముందుండి కృషి చేశామని పేర్కొన్నారు. 1983లో స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన నాటి నుంచే తమ కుటుంబం పార్టీతో విడదీయరాని అనుబంధం కలిగి ఉందని జ్ఞానేశ్వర్ గౌడ్ గుర్తుచేశారు. అప్పటి నుంచి పార్టీ బలోపేతానికి, ప్రజా సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తున్నామని తెలిపారు. గ్రామంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తావులేకుండా అన్ని సామాజిక వర్గాల ప్రజలను కలుపుకొని, అందరి సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలన్నదే తన ప్రధాన అభిమతమని ఆయన స్పష్టం చేశారు. తమ కుటుంబం సమాజానికి అందించిన మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రజాసేవను ప్రజలు, పార్టీ శ్రేణులు గుర్తించాలని కోరారు. ఈసారి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన తన సతీమణి ఎల్.ఈ. పుష్పావతిని భారీ మెజారిటీతో గెలిపించి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆశీస్సులు, కూటమి నాయకుల మద్దతుతో వెల్దుర్తి గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.