seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 8:59 am Digital Edition : SEEMA KIRANAM

వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మన రమకాంత్ రెడ్డి

కీర్తిశేషులు బొమ్మన శివశంకర్ రెడ్డి సేవలు వెల్దుర్తి ప్రజలకు చిరస్మరణీయం

 

తండ్రి ఆశయాలతో ప్రజాసేవ కొనసాగిస్తున్న రమకాంత్ రెడ్డిని గెలిపించండి – టీడీపీ నాయకులు

 

వెల్దుర్తి, నవంబర్ 12 (సీమకిరణం న్యూస్):

 

వెల్దుర్తి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బొమ్మన రమకాంత్ రెడ్డి పోటీ చేస్తున్నట్లు టీడీపీ నాయకులు వెల్లడించారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం వెల్దుర్తిలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వెల్దుర్తి మండల సీనియర్ నాయకులు కీర్తిశేషులు బొమ్మన శివశంకర్ రెడ్డి చేసిన సేవలను నాయకులు గుర్తుచేసుకుంటూ, ఆయన తనయుడు బొమ్మన రమకాంత్ రెడ్డిని సర్పంచ్‌గా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అభివృద్ధి చేసే నాయకత్వం అవసరం : మైనార్టీ నాయకుడు ఉస్మాన్

ఈ సందర్భంగా టీడీపీ మైనార్టీ నాయకుడు టైలర్ ఉస్మాన్ మాట్లాడుతూ.. వెల్దుర్తిలో గతంలో ఎంతోమంది సర్పంచులుగా పనిచేసినప్పటికీ గ్రామ అభివృద్ధికి ఆశించిన స్థాయిలో కృషి చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. కొందరు పదవులను స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారే తప్ప గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించలేదని వ్యాఖ్యానించారు. స్వార్థ ప్రయోజనాల కంటే గ్రామాభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చే నాయకత్వం వెల్దుర్తికి అవసరమని అన్నారు.

శివశంకర్ రెడ్డి బతికుంటే ఎన్నిక ఏకగ్రీవమయ్యేది: ఎంపీటీసీ మాసపోగు బజారి

అనంతరం టీడీపీ నాయకుడు బజారి మాట్లాడుతూ.. కీర్తిశేషులు బొమ్మన శివశంకర్ రెడ్డి జీవించి ఉంటే వెల్దుర్తి సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమయ్యే పరిస్థితి ఉండేదని అభిప్రాయపడ్డారు. ఆయన ఏనాడూ ఏ వర్గాన్ని విమర్శించకుండా, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సహాయ సహకారాలు అందించిన గొప్ప నాయకుడని కొనియాడారు. సొంత ఆస్తులను సైతం అమ్ముకుని రాజకీయాల్లో కొనసాగిన వ్యక్తి బొమ్మన శివశంకర్ రెడ్డి అని, ఎవరి దగ్గరా చేయి చాచకుండా తన సొంత వనరులతో ప్రజలకు సేవ చేశారని గుర్తుచేశారు. ఆయన చేసిన సేవలు వెల్దుర్తి ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయని పేర్కొన్నారు.

తండ్రి బాటలో తనయుడి ప్రజాసేవ

కీర్తిశేషులు బొమ్మన శివశంకర్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ ఆయన తనయుడు బొమ్మన రమకాంత్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని నాయకులు తెలిపారు. గ్రామంలో ఎవరికైనా సమస్య ఎదురైతే వెంటనే స్పందించి పరిష్కారానికి కృషి చేసే వ్యక్తి అని పేర్కొన్నారు. తండ్రి చూపిన సేవా మార్గంలో నడుస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు రమకాంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. వెల్దుర్తి గ్రామ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి బొమ్మన రమకాంత్ రెడ్డి వంటి సేవాభావం కలిగిన నాయకుడి అవసరం ఎంతో ఉందని నాయకులు అభిప్రాయపడ్డారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో బొమ్మన రమకాంత్ రెడ్డికి ప్రజలు తమ విలువైన ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.