seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 4:28 am Digital Edition : SEEMA KIRANAM

వెల్దుర్తి ప్రజల చూపు తిరివీధి రమేష్ వైపు!

వెల్దుర్తి ప్రజల ఆశలు.. తిరివీధి రమేష్ అడుగులు!

 

 

తండ్రి శివయ్య ప్రజాసేవా వారసత్వమే స్ఫూర్తి

 

 

జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకుడిగా, పారిశ్రామికవేత్తగా ప్రత్యేక గుర్తింపు.. 

 

 

గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు!

 

 

 

వెల్దుర్తి నజీర్, నవంబర్ 06 (సీమకిరణం న్యూస్):

 

 

వెల్దుర్తి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందడి నెలకొన్న నేపథ్యంలో తిరివీధి రమేష్ పేరు చర్చనీయాంశంగా మారుతోంది. జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకుడిగా, ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన ఆయన ఇప్పుడు గ్రామ రాజకీయాల్లోకి అడుగుపెట్టి సర్పంచ్ అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చారు. వ్యాపార రంగంలో సంపాదించిన అనుభవంతో పాటు తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ప్రజాసేవా స్ఫూర్తిని కలగలిపి గ్రామాభివృద్ధికి కృషి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. తిరివీధి రమేష్‌కు ప్రజాసేవ కొత్తేమీ కాదు. ఆయన తండ్రి కీర్తిశేషులు శివయ్య గతంలో సుమారు 18 సంవత్సరాల పాటు సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహించి గ్రామానికి సేవలందించారు. ఆ కాలంలో గ్రామ అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలు, ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధం ఇప్పటికీ గ్రామంలో గుర్తు చేసుకుంటుంటారు. తండ్రి సంపాదించిన మంచి పేరు, ప్రజలతో ఏర్పరచుకున్న అనుబంధాన్ని కొనసాగించాలనే ఆశయంతో రమేష్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను నేరుగా కలుస్తున్నారు. వారి సమస్యలను తెలుసుకుంటూ, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని భరోసా కల్పిస్తున్నారు. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని గ్రామ సమగ్రాభివృద్ధికి కృషి చేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ఇటీవల 15వ వార్డులోని సఫా మసీదును సందర్శించి ముస్లిం సోదరులతో సమావేశమవడం, వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం, మసీదుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు సహకరిస్తానని హామీ ఇవ్వడం ఆయన పర్యటనలో ప్రత్యేకంగా నిలిచింది. కులమతాలకు అతీతంగా గ్రామంలోని ప్రతి ఒక్కరి సమస్యను తన సమస్యగా భావించి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన చెబుతున్నారు. గ్రామంలో రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల అభివృద్ధితో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలనే లక్ష్యాలను ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. పేద కుటుంబాలకు అండగా నిలవడం, గ్రామంలో ఐక్యతను పెంపొందించడం వంటి అంశాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. కీర్తిశేషులు తండ్రి శివయ్య ప్రజాసేవా వారసత్వం ఒకవైపు.. జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకుడిగా, పారిశ్రామికవేత్తగా తిరివీధి రమేష్‌కు ఉన్న అనుభవం మరోవైపు.. ఈ రెండింటినీ గ్రామాభివృద్ధికి ఉపయోగించాలనే సంకల్పంతో ఆయన సర్పంచ్ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. వెల్దుర్తిని అభివృద్ధి పథంలో నడిపించడమే తన లక్ష్యమని ఆయన పేర్కొంటున్నారు.