seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 9:36 am Digital Edition : SEEMA KIRANAM

వెల్దుర్తిలో ఘనంగా స్టార్ ఎగ్జిబిషన్ ప్రారంభం

వెల్దుర్తిలో ఘనంగా స్టార్ ఎగ్జిబిషన్ ప్రారంభం

 

కొత్త వినోద ప్రపంచం.. స్టార్ ఎగ్జిబిషన్‌తో వెల్దుర్తిలో సందడి

 

వెల్దుర్తి, ఆగస్టు 21 (సీమకిరణం న్యూస్):

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని రామళ్లకోట రోడ్డులో బీడీఆర్ వెంచర్ వద్ద ఏర్పాటు చేసిన స్టార్ ఎగ్జిబిషన్‌ను బొమ్మన దశరథ రామిరెడ్డి ఘనంగా ప్రారంభించారు. కర్నూలు జిల్లా కేంద్రంలో లభించే వినోద సౌకర్యాల తరహాలో వెల్దుర్తి ప్రజలకు ఆహ్లాదాన్ని అందించాలనే ఉద్దేశంతో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. చిన్నారులు, యువత, కుటుంబ సభ్యులను ఆకట్టుకునేలా జాయింట్ వీల్, బ్రేక్ డాన్స్, డ్రాగన్ ట్రైన్, వాటర్ బోట్, బౌన్సర్, కిడ్స్ కార్ రొటేటర్ తదితర వినోద పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎగ్జిబిషన్ ప్రారంభంతో రామళ్లకోట రోడ్డులో సందడి వాతావరణం నెలకొంది. వెల్దుర్తిలో ప్రత్యేకమైన వినోద, విహార ప్రదేశాలు తక్కువగా ఉండటంతో స్టార్ ఎగ్జిబిషన్ రావడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో సరదాగా గడిపే అవకాశం లభించిందని పలువురు పేర్కొన్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ ఆకట్టుకునే విధంగా ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వెల్దుర్తి ప్రజలు, పరిసర ప్రాంతాల కుటుంబాలు స్టార్ ఎగ్జిబిషన్‌ను సందర్శించి వినోదాన్ని ఆస్వాదించాలని నిర్వాహకులు కోరారు.