ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-చంద్రశేఖర్ రావు
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీలో మార్పు లేదు. తాకిడి కొనసాగుతోంది. ఆదివారం నాడు 86,091 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 29,664 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.21 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని వారికి శ్రీవారి సర్వ దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది.
శ్రీతుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవాలకు తిరుమల ముస్తాబు అవుతోంది. ఈ నెల 31, ఏప్రిల్ 1 తేదీల్లో ఈ వేడుకలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై తిరుమల పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు నిర్ణయాలను తీసుకున్నారు. వివిధ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

భక్తుల భద్రత దృష్ట్యా తుంబురు తీర్థానికి 31, ఏప్రిల్ 1వ తేదీల్లో తెల్లవారు జామున 6 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. పాపవినాశనం డ్యామ్ వద్ద భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, మంచినీటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. వాటిని పంపిణీ చేయడానికి 100 మంది శ్రీవారి సేవకులను వినియోగించాలని నిర్ణయించారు. ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, మందులు, పారామెడికల్ సిబ్బంది మోహరింపజేయనున్నారు.
తుంబురు తీర్థానికి చాలా దూరం నడవాల్సి ఉండటంతో వృద్దులు, 12 ఏళ్లలోపు పిల్లలు, దీర్ఘవ్యాధిగ్రస్తులు, గుండె- శ్వాస సంబంధిత సమస్యలు, స్థూలకాయం ఉన్నవారికి అనుమతి లేదు. భక్తులు తమ వెంట ఎటువంటి వంట సామగ్రి, కపూరం, అగ్గిపెట్టెలు తీసుకురాకూడదని ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి సూచించారు. పోలీసు, శాఖశాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాపవినాశనం నుండి తుంబురు తీర్థం వరకు భద్రతా సిబ్బందిని ఉంచుతారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు. తుంబురు తీర్థానికి వెళ్లే మార్గం సూచికలో బోర్డులు ఏర్పాటు చేస్తారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని గోగర్భం డ్యామ్ సర్కిల్ నుండి పాపవినాశనం వరకు ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతిస్తారు. ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఉండదు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని సహకరించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేశారు.

