seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 1:27 pm Digital Edition : SEEMA KIRANAM

వినాయకుడి ఆశీస్సులతో వరుణదేవుడు కరుణించాలి

విఘ్నేశ్వరుడి కరుణతో ఎల్‌నీనో ప్రభావం తొలగి.. వరుణుడు కరుణించాలి..!

 

 

గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ

 

 

ఎల్‌నీనో ప్రభావం తగ్గి రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థించిన డాక్టర్ శంకర్ శర్మ

 

 

కర్నూలు ప్రతినిధి, సెప్టెంబర్ 09, (సీమకిరణం న్యూస్):

 

 

వినాయక చవితి పండుగను హిందువులందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ పిలుపునిచ్చారు. గాయత్రీ ఎస్టేట్‌లోని జై గురుదత్త పాలీ క్లినిక్‌లో పేద హిందూ మహిళలకు ఆయన వినాయక చవితి పండుగ సందర్భంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ, ఎల్‌నీనో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం అధికమైందన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పేద హిందూ కుటుంబాలు కూడా వినాయక చవితి పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో తనవంతు సహాయంగా పండుగ సరుకులను అందజేశానని తెలిపారు. ఈ సందర్భంగా వినాయక చవితి పర్వదిన విశిష్టతను ఆయన వివరించారు. 1893 సంవత్సరంలో స్వాతంత్ర్య సమరయోధుడు బాల గంగాధర్ తిలక్ బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి సామూహికంగా పూజలు నిర్వహించే సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. అప్పటి నుంచి నేటి వరకు దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల కారణంగా వినాయక విగ్రహాల నిమజ్జనానికి కూడా నీటి సమస్య ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ఎల్‌నీనో ప్రభావం తగ్గి, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని డాక్టర్ శంకర్ శర్మ ఆకాంక్షించారు.