seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 1:22 pm Digital Edition : SEEMA KIRANAM

విదేశీయుల బస పై పోలీసుల నిఘా

24 గంటల్లో ఫారం-సి తప్పనిసరి..!

 

విదేశీయుల బస వివరాలు తప్పని సరిగా ఆన్‌లైన్‌ లో నమోదు చేయాలి

 

24 గంటల్లోగా ఫారం-సి ద్వారా వివరాలు నమోదు చేయాలి

 

నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

 

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్

 

కర్నూలు క్రైమ్, అక్టోబర్ 06, (సీమకిరణం న్యూస్) :

 

జిల్లా పరిధిలో విద్య, వైద్యం, పర్యాటకం, వ్యాపారం లేదా ఇతర అవసరాల నిమిత్తం వచ్చే విదేశీయులకు వసతి కల్పించే హోటళ్లు, రిసార్టులు, గెస్ట్‌హౌస్‌లు, అద్దె ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, ఆసుపత్రులు, హాస్టళ్లు, ఆశ్రమాలు, విద్యా సంస్థలు, ఇతర ప్రాంగణాల యజమానులు లేదా నిర్వాహకులు విదేశీయుల బస వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం తెలిపారు.
ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ చట్ట నిబంధనల ప్రకారం విదేశీయుల రాక, బస, నిష్క్రమణకు సంబంధించిన వివరాలను బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ పోర్టల్‌లోని ఫారం-సి ద్వారా పూర్తి వివరాలతో 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. అవసరమైన వివరాలను సంబంధిత ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ/ఎఫ్‌ఆర్‌ఓ కార్యాలయాలకు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.
విదేశీయుల బస వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించినా, నిబంధనలను ఉల్లంఘించినా సంబంధిత యజమానులు లేదా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. నిబంధనల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానా, జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాకు వచ్చే విదేశీయులు చెల్లుబాటయ్యే పాస్‌పోర్టు, వీసా కలిగి ఉండటంతో పాటు భారతదేశంలోని చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ స్పష్టం చేశారు.
విదేశాల్లో స్థిరపడిన ఓసీఐ కార్డుదారులు భారతదేశంలో ఎన్నికల్లో పోటీ చేయడం, ఓటు వేయడం లేదా వ్యవసాయ భూములను కొనుగోలు చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడకూడదని తెలిపారు. తమ పరిసరాల్లో నివసిస్తున్న విదేశీయుల గురించి ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే స్థానిక ప్రజలు పోలీసులకు టెలిఫోన్ లేదా ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. విదేశీయులకు వసతి కల్పించే హోటళ్లు, సంస్థలు, ఇళ్లు, ఇతర ప్రాంగణాల యజమానులు, నిర్వాహకులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సంబంధిత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ కోరారు.