seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 3:49 pm Digital Edition : SEEMA KIRANAM

వర్షాల కోసం ముస్లిం సోదరుల ప్రత్యేక నమాజులు

వెల్దుర్తిలో వర్షాల కోసం ముస్లిం సోదరుల ప్రత్యేక నమాజులు

 

అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు..

 

 సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థనలు

 

వెల్దుర్తి, జులై 10, (సీమకిరణం న్యూస్):

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శుక్రవారం జుమ్మా ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక నమాజులు నిర్వహించారు. పట్టణంలోని ఐదు మసీదులకు చెందిన ఇమామ్‌లు, ముస్లిం పెద్దలు, యువకులు కలిసి చెరుకులపాడు గ్రామ రహదారికి ఆనుకుని ఉన్న పొలాల్లో సామూహికంగా సలాతుల్ ఇస్తిస్కా (వర్ష ప్రార్థన) నిర్వహించి అల్లాహ్‌ను ప్రార్థించారు. ఈ సందర్భంగా ఇమామ్‌లు పవిత్ర దివ్య ఖుర్‌ఆన్‌లోని ఆయతులను పఠించి, అనంతరం ప్రత్యేక దువా నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతుల పంటలు బాగా పండాలని, ప్రజలందరూ శాంతి, సౌభాగ్యాలతో ఉండాలని అల్లాహ్‌ను వేడుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ వర్షాల కోసం మూడు రోజుల పాటు ప్రత్యేక నమాజులు, ప్రార్థనలు కొనసాగిస్తామని తెలిపారు. భక్తిశ్రద్ధలతో దైవాన్ని ప్రార్థిస్తే అల్లాహ్ తన కరుణతో సమృద్ధిగా వర్షాలు కురిపిస్తాడనే విశ్వాసంతో ఈ ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.