seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 5:34 pm Digital Edition : SEEMA KIRANAM

లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

 

దిల్లీ, ఫిబ్రవరి 02, (సీమకిరణం న్యూస్) :

సుస్థిరాభివృద్ధిని కొనసాగిస్తూ.. అంతర్జాతీయ ఒత్తిడులను తట్టుకునే లక్ష్యంతో 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ఆదివారం లోక్సభలో ప్రవేశపెట్టింది (Union Budget 2026). ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ను లోక్సభకు సమర్పించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆదివారం వార్షికపద్దును ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. బడ్జెట్కు ముందు తన బృందంతో కలిసి నిర్మలాసీతారామన్ రాష్ట్రపతి భవన్కు చేరుకుని ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్మును కలిశారు. రాష్ట్రపతికి బడ్జెట్ పత్రాలు అందజేశారు. సంప్రదాయాన్ని అనుసరిస్తూ మంత్రికి రాష్ట్రపతి మిఠాయి తినిపించారు. అనంతరం బడ్జెట్కు క్యాబినెట్ ఆమోదం తెలపడంతో.. ఉదయం 11 గంటలకు మంత్రి లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. “పవిత్ర మాఘపౌర్ణిమ రోజున బడ్జెట్ తీసుకువస్తున్నాం. కర్తవ్య భవన్లో రూపొందించిన మూడో బడ్జెట్ ఇది. యువశక్తి కేంద్రంగా దీనిని ప్రవేశపెడుతున్నాం. భారత దేశ ఆర్థిక ప్రయాణం స్థిరంగా సాగుతోంది. ప్రపంచ మార్కెట్లతో భారత్ను అనుసంధానిస్తున్నాం. ప్రజల ఆకాంక్షలను ఆచరణలో తీసుకొస్తున్నాం. నైపుణ్యం, పోటీతత్వం, ఉత్పాదకతతో భారత్ను ప్రపంచస్థాయికి తీసుకెళ్తాం. రైతులు, దళిత, గిరిజన సమూహాలకు అభివృద్ధి ఫలాలు చేరాలి” అని ఆమె పేర్కొన్నారు.

 

*వరుసగా రికార్డు*

 

నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది తొమ్మిదోసారి. ఇప్పటివరకూ మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఆయన వరుసగా ప్రవేశపెట్టలేదు. వేర్వేరు సమయాల్లో అందించారు. మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం మొత్తం 9 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. కానీ ఆయన వరుసగా చేయలేదు. అలాగే నిర్మలా సీతారామన్ మరోఅరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఆమె 2019 మే 31న ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2026 జనవరి 31 నాటికి ఆమె ఈ పదవిలో 6 ఏళ్ల 8 నెలలు పూర్తి చేసుకున్నారు. గతంలో సి.డి.దేశ్ ముఖ్ ఆరేళ్ల రెండు నెలలపాటు నిరంతరాయంగా ఆర్థిక మంత్రిగా పనిచేశారు.