తప్పుడు ప్రచారాలను నమ్మి ఆందోళన చెందవద్దు
డోన్ ఆర్టీవో క్రాంతి కుమార్
సెప్టెంబర్ 25లోపు మొబైల్ నంబర్ లింక్ చేయకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందన్న ప్రచారం పూర్తిగా ఆవాస్తవం
డోన్, సెప్టెంబర్ 21, (సీమకిరణం న్యూస్):
ఈ నెల 25వ తేదీలోపు డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్ అనుసంధానం చేయకపోతే లైసెన్స్ రద్దవుతుందంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని డోన్ ఆర్టీవో క్రాంతి కుమార్ స్పష్టం చేశారు. వాహనదారులు తప్పుడు ప్రచారాలను నమ్మి ఆందోళన చెందవద్దని సూచించారు. వాహనాల రిజిస్ట్రేషన్‌తో పాటు డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్‌ను అనుసంధానం చేసుకోవడం అవసరమని తెలిపారు. అయితే ఇందుకు ప్రభుత్వం ఎలాంటి గడువు విధించలేదన్నారు. సెప్టెంబర్ 25లోపు మొబైల్ నంబర్ లింక్ చేయకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.
అధికారిక పోర్టల్ ద్వారా అనుసంధానం…
వాహనదారులు అధికారిక సారథి పరి వాహన్ పోర్టల్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, మొబైల్ నంబర్‌ను అనుసంధానం చేసుకోవచ్చని ఆర్టీవో తెలిపారు. వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సేవల కోసం వాహన్ విభాగాన్ని వినియోగించుకోవచ్చన్నారు. ప్రస్తుతం సర్వర్ సమస్యల కారణంగా వెబ్‌సైట్ నెమ్మదిగా పనిచేస్తోందని, దీనిపై వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సర్వర్ సమస్యలు పరిష్కారమైన తర్వాత కూడా మొబైల్ నంబర్ అనుసంధాన ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని సూచించారు.