seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 7:33 am Digital Edition : SEEMA KIRANAM

లెక్చరర్ అవమానించారంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

లెక్చరర్ అవమానించారంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

 

సూసైడ్ నోట్‌లో ఆరోపణలు.. విచారణకు డిమాండ్

 

గద్వాల, జూలై 29, (సీమకిరణం న్యూస్) :

 

గద్వాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కొత్తపల్లి గ్రామానికి చెందిన నేతిబొట్టు తరుణ్ (17) అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. కుటుంబ సభ్యులు, అందుబాటులోకి వచ్చిన సమాచారం ప్రకారం, ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో 434 మార్కులు సాధించి జిల్లాలో రెండో స్థానం పొందిన తరుణ్‌ను, మరో విద్యార్థితో పోల్చుతూ ఓ మహిళా లెక్చరర్ తరగతి గదిలో అవమానించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేసిన తరుణ్‌ను లెక్చరర్ చెంపపై కొట్టి అవమానించారని కూడా ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన తరుణ్, మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఘటన స్థలంలో లభించినట్లు చెబుతున్న సూసైడ్ నోట్‌లో, “ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలి కానీ అవమానించకూడదు. నాపై జరిగిన అవమానానికి బాధపడి ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. సంబంధిత లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలి. ఈ విషయం ప్రజలకు తెలియాలి” అని పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, సూసైడ్ నోట్‌తో పాటు ఇతర ఆధారాలను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు. లెక్చరర్‌పై వచ్చిన ఆరోపణల నిజానిజాలు విచారణ అనంతరం తేలనున్నాయి.