తెలంగాణ
ఓయ్-సాయి చైతన్య
తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. చాలా కాలంగా వేచి చూస్తున్న నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఖరీఫ్‌లో సన్న వడ్లు కొనుగోలుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బోనస్ బకాయిలను క్లియర్ చేస్తూ రూ.514.36 కోట్ల నిధులను విడుదల చేసింది. క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ రూపంలో రైతుల ఖాతాల్లో నేరుగా జమ కానున్నాయి. దీని ద్వారా సుమారు 2.17 లక్షల మంది రైతులు నేరుగా లబ్ధి పొందనున్నారు. అదే విధంగా రైతు భరోసా నిధులను ప్రభుత్వం రేపటి నుంచి రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కసరత్తు చేస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమలు చేస్తున్న విధంగా సన్న వడ్ల కొనుగోలుకు సంబంధించిన పెండింగ్ బోనస్ బకాయిలను రైతుల ఖాతాల్లో జమ చేసింది. సుమారు 2.17 లక్షల మంది రైతుల ఖాతాల్లో క్వింటాల్ కు రూ 500 చొప్పున నేరుగా లబ్ధి పొందనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మొత్తం 1,939.58 కోట్ల రూపాయల బోనస్‌ను చెల్లించింది. రాష్ట్రంలో సన్న సాగును ప్రోత్సహించడం, రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. కాగా.. రైతుల సంక్షేమమే ప్రాధాన్యతగా.. ధాన్యం కొనుగోళ్లు, బోనస్ చెల్లింపులు, ఎమ్మెస్‌పీతో పాటు అదనపు ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. ఈ నిధుల విడుదలతో పెండింగ్ బకాయిలు దాదాపు పూర్తిగా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. రైతులు తమ బ్యాంకులను తనిఖీ చేసుకోవాలని, మీ ఖాతాలో ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత కొనుగోలు కేంద్రాలు, సివిల్ సప్లైస్ శాఖను సంప్రదించాలని అధికారులు సూచించారు.

రైతుల ఖాతాల్లో బకాయిల జమ
కాగా, రేపు (మంగళవారం) ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు తుది కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో 69,39,548 మంది రైతులకు ఎకరానికి రూ.6వేల చొప్పున రూ.8,744.13 కోట్లు రైతు భరోసా కింద ఇచ్చారు. దాదాపు 1,45,73,000 ఎకరాలకు నిధులు అందించారు. ఈ యాసంగిలోనూ దాదాపు 1.46 కోట్ల ఎకరాలకు రైతు భరోసా ఉంటుంది. రైతు భరోసా కోసం ప్రభుత్వం రూ.9వేల కోట్లను ఖర్చు చేయనుంది. ఎన్నికల మున్సిపల్ కోడ్ పూర్తి అయిన వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని సీఎం రేవంత్ ఆర్దిక శాఖ అధికారులకు తాజాగా నిర్దేశించారు. అయితే, కొద్ది రోజులుగా లబ్దిదారుల ఖాతాల్లో భారీగా కోత ఉంటుందనే చర్చ జరిగింది. శాటిలైట్ సర్వే నివేదికను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఇప్పటికే నిధుల సమీకరణ పూర్తి కావటంతో రేపటి నుంచి 17వ తేదీ) వరుసగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు తుది కసరత్తు కొనసాగుతోంది.

