రైతుల సమక్షంలో భూ కొలతలు తీసుకుని పారదర్శకంగా పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసి భూ రికార్డుల్లో తప్పులు సరిదిద్దుతున్నాం
క్యూఆర్ కోడ్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో భూ రికార్డులకు భద్రత
రూపాయి అవినీతి లేకుండా రైతులకు ఉచితంగా పట్టాదారు పాసు పుస్తకాలు
రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరు అందించడమే లక్ష్యం – రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
నంద్యాల ప్రతినిధి / డోన్, మార్చి 09, (సీమకిరణం న్యూస్) :

డోన్ నియోజకవర్గంలోని కొత్త బురుజు గ్రామంలో నిర్వహించిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో రెవెన్యూ శాఖను పూర్తిగా అస్తవ్యస్తం చేశారని విమర్శించారు. ప్రైవేట్ భూములను కూడా 22ఏ కింద నమోదు చేసి రైతులను ఇబ్బందులకు గురిచేసారని పేర్కొన్నారు. అడిగిన భూమి ఇవ్వకపోతే ఆ భూములను 22ఏలో పెట్టే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించిందని అన్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకువచ్చి ప్రైవేట్ భూములపై అజమాయిషీని కొందరి చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నించారని, అప్పీల్‌కు వెళ్లే అవకాశాన్ని కూడా లేకుండా చేయాలనుకున్నారని తెలిపారు. పాణ్యం నియోజకవర్గంలో పట్టాదారు పుస్తకాన్ని కాల్చి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చానని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేసి భూ రికార్డుల్లో ఉన్న తప్పులను సరిదిద్దే చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి వివరించారు. రైతుల భూములు వారసత్వంగా వచ్చినవైనా, స్వయంగా కష్టపడి కొనుగోలు చేసినవైనా వాటికి సంబంధించిన పుస్తకాలపై ఫోటోలు ముద్రించడం వంటి చర్యలు తీసుకోవడం అనవసరమని అన్నారు. ఫోటోల ముద్రణ కోసం సర్వే రాళ్లపై కూడా ముద్రించి సుమారు రూ.750 కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటించినప్పుడు భూ సమస్యలపై వేలాది అర్జీలు వచ్చాయని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను సరిదిద్దేందుకు దాదాపు 20 నెలలు పట్టిందని తెలిపారు. ప్రస్తుతం రైతుల సమక్షంలోనే భూ కొలతలు తీసుకుని, వారి ఆమోదంతో భూ వివరాలు నమోదు చేసి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను అందిస్తున్నామని చెప్పారు. భూ రికార్డులను ఎవరూ తారుమారు చేయకుండా ఉండేందుకు క్యూఆర్ కోడ్ విధానం అమలు చేస్తున్నామని, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా అధికారులు తప్పు చేసినా గుర్తించే విధంగా వ్యవస్థను బలోపేతం చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న కొత్త పట్టాదారు పుస్తకాలను ఎవరూ ట్యాంపర్ చేయలేరని స్పష్టం చేశారు.
రూపాయి అవినీతి లేకుండా రైతులకు ఉచితంగా పట్టాదారు పాసు పుస్తకాలను అందిస్తున్నామని, ఎవరూ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 16,816 గ్రామాలు ఉండగా గత ప్రభుత్వంలో 6,860 గ్రామాల్లో సర్వే నిర్వహించి, అనేక తప్పులతో 19.93 లక్షల పాసు పుస్తకాలు ఇచ్చారని అన్నారు. ఆ రికార్డుల్లో జరిగిన తప్పులను సరిచేసి మళ్లీ కొత్తగా రైతులకు పుస్తకాలు అందిస్తున్నామని వివరించారు. రిజిస్ట్రేషన్ విధానాన్ని కూడా సులభతరం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రజలు విశ్వసించి అధికారం ఇచ్చారని పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలో పార్లమెంట్ స్థానం సహా ఎనిమిది స్థానాలను కూటమి అభ్యర్థులు గెలిచారని గుర్తు చేశారు. ప్రజాహితం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు. గత ప్రభుత్వంలో అనేక కుంభకోణాలు, వివాదాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. కల్తీ మద్యం కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని, ఎక్సైజ్ శాఖలో నెలకు వంద కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగిందని విమర్శించారు. ప్రజల ఆరోగ్యం కంటే డబ్బులకే ప్రాధాన్యం ఇచ్చారని, తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యి కూడా కల్తీ చేశారని ఆరోపించారు. రాయలసీమ ప్రాంతంలో ఒకప్పుడు ముఠా తగాదాలు తీవ్రంగా ఉండేవని, ఎన్నికల సమయంలో డబ్బుల కంటే బాంబులు అడిగే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితులు ప్రజాస్వామ్యంలో ఉండకూడదని భావించి ఈ ప్రాంతంలో ముఠా తగాదాలను పూర్తిగా అరికట్టామని చెప్పారు. గ్రామాల్లో ప్రశాంతత నెలకొల్పేందుకు పరస్పర విభేదాలు ఉన్న నేతలను కూడా కలిపామని తెలిపారు. డోన్ నియోజకవర్గంలో 30 చెరువులకు హంద్రీనీవా ప్రాజెక్ట్ ద్వారా నీరు అందించినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును ప్రారంభించినది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. రాయలసీమలో హంద్రీనీవా, నగరి గాలేరు, ఎస్ఆర్బీసీ, తెలుగు గంగ వంటి ప్రాజెక్టులకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని, వాటిని పూర్తి చేసే అదృష్టం తనకు దక్కిందని తెలిపారు. భగీరథుని స్పూర్తితో రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరు అందించాలన్నదే తన సంకల్పమని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలో నీరు నిల్వ ఉండేలా చేసి పొలాలన్నీ పచ్చగా మారేలా చర్యలు తీసుకుంటామని, రాయలసీమను ఉద్యానవనంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాయలసీమలో ఉత్పత్తి అయ్యే పంటలను దేశవ్యాప్తంగా మార్కెట్ చేయడంతో పాటు మెరుగైన విత్తనాలు, కొత్త రకాల పంటలను కూడా ఈ ప్రాంతానికి తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతంలో రైతుల ఆదాయం పెంచేందుకు ఉద్యానవన పంటలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మామిడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని చెప్పారు. మామిడి పండ్ల ధరలు తగ్గిన సందర్భాల్లో రైతులకు నష్టపోకుండా ఉండేందుకు కిలోకు రూ.4 చొప్పున సబ్సీడీ అందజేశామని వివరించారు. అలాగే మామిడి పండ్లకు తొడిగే కవర్లపై 50 శాతం సబ్సీడీ అందిస్తున్నామని తెలిపారు. కవర్లు తొడిగిన మామిడి పండ్లు మెరుగైన నాణ్యతతో ఉండటంతో రైతులకు మంచి ధర లభిస్తోందని చెప్పారు. ఇటువంటి పండ్ల ద్వారా రైతులకు ఎకరాకు సుమారు రూ.40 వేల వరకు ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో మామిడి పండ్లకు టన్నుకు సుమారు రూ.1.70 లక్షల వరకు ధర లభిస్తోందని తెలిపారు. రాయలసీమను దేశంలో ప్రముఖ హార్టికల్చర్ హబ్ గా అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి సుమారు రూ.30 వేల కోట్ల నిధులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కొంతమంది చేస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి ఖండించారు. తిరుమల లడ్డూ కల్తీ, మద్యం అవినీతి, భూ దోపిడీ వంటి అంశాలపై ప్రభుత్వం సమగ్రంగా ప్రక్షాళన చర్యలు చేపడుతున్నప్పటికీ వాటిపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తిరుమల లడ్డూ అంశంపై సీబీఐ ఇచ్చిన నివేదికపై కూడా అపోహలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. వేంకటేశ్వర స్వామి పవిత్రతకు భంగం కలిగించే చర్యలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు. ఎవరు చేసినా అలాంటి చర్యలను ఉపేక్షించబోమని తెలిపారు. తాను ఎప్పుడూ పేదల సంక్షేమం కోసమే కష్టపడుతున్నానని, పేదలకు అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తల్లికి వందనం’ పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కో కుటుంబానికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. మహిళల సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ ‘స్త్రీ శక్తి’ కార్యక్రమం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, ఇప్పటివరకు మహిళలు సుమారు 50 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు చేసినట్లు వెల్లడించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వ కాలంలో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొంటూ, నంద్యాల జిల్లాలో ఆర్ అండ్ బీ రోడ్లలో ఉన్న గుంతలను తొలగించి మెరుగుపరిచామని తెలిపారు. అలాగే పంచాయతీ రాజ్ పరిధిలోని రోడ్లను కూడా పూర్తిగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకోసం రూ.4 వేల కోట్ల నిధులను కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కర్నూలులో డ్రోన్ సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, అనంతపురాన్ని ఎయిరో స్పేస్ సిటీగా అభివృద్ధి చేసే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వ కాలంలో ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై సుమారు రూ.32 వేల కోట్ల భారం మోపారని ఆయన విమర్శించారు. అయితే తమ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచబోదని స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన సేవలను సులభంగా అందించేందుకు వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంటూ, ఇప్పటికే లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలతో ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరో ఐదు లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. పేదల సంక్షేమం కోసం ‘పీ4’ విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి వైకుంఠ పాళి ఆటలా ఉండకూడదని, స్థిరంగా ముందుకు సాగేలా సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం పని చేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలు ఒక ముఖ్యమైన ఫిర్యాదు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పట్టాదారు పాస్‌బుక్‌లపై ఉండడం వల్ల తమకు అసౌకర్యంగా ఉందని ప్రజలు తెలియజేశారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఫోటోలను తొలగించి, రాజముద్రతో కొత్త పాస్‌బుక్‌లు అందజేస్తామని అప్పట్లో హామీ ఇచ్చామని, ఇప్పుడు ఆ హామీని ప్రభుత్వం నెరవేర్చిందని ఆయన పేర్కొన్నారు. నంద్యాల ప్రాంతంలో చాలా కాలంగా సాగునీరు మరియు తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. వర్షాలు కురిసినప్పుడే పంటలు పండే పరిస్థితి ఉండేదని, అయితే ఇటీవల ముఖ్యమంత్రి గారు మరియు లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల పరిస్థితి కొంత మెరుగుపడిందని అన్నారు. అలాగే బుడగజంగాల సమస్యను కూడా పరిష్కరించాలని ముఖ్యమంత్రిని కోరారు. గుండ్రేవుల వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం జరిగితే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ ప్రాంతానికి పరిశ్రమలు వస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. అదేవిధంగా రహదారి అభివృద్ధి కూడా అత్యంత అవసరమని పేర్కొన్నారు. నంద్యాల నుండి కోయిలకుంట్ల వరకు ఫోర్-లేన్ రహదారి నిర్మాణం చేయడంతో పాటు మరికొన్ని బైపాస్ రహదారులను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నందున విద్యా పరంగా ఒక మైనింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కూడా ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో ముఖ్యమంత్రి వాల్మీకీ సమాజానికి ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రేషన్ డిపోల సమస్యలను పరిష్కరించడం, చెక్ డ్యామ్ల నిర్మాణం చేపట్టడం వంటి చర్యలు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో తోడ్పడతాయని అన్నారు. ముఖ్యంగా రైతుల కష్టాలు తీరాలంటే సాగునీటి సౌకర్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలు మరియు స్థానిక సమస్యలన్నిటినీ పరిశీలించి నంద్యాల ప్రాంత అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, నంద్యాల జిల్లాకు 128 కిలోమీటర్ల దూరంలో, డోన్ మండల కేంద్రానికి 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న నంద్యాల మండలంలోని చిట్టచివరి గ్రామమైన కొత్తబురుజుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రావడం ఆనందకరమని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల తరఫున ముఖ్యమంత్రికి హృదయపూర్వక స్వాగతం పలికారు. డోన్ మండలం సముద్ర మట్టానికి సుమారు 500 నుంచి 600 మీటర్ల ఎత్తులో ఉండటంతో పాటు ఇక్కడి భూభాగం ఎక్కువగా రాతి నేల (రాకీ టెర్రెయిన్)గా ఉందన్నారు. ఈ కారణంగా రైతులు ప్రధానంగా వర్షాధార పంటలు సాగు చేయడం తో పాటు బోరు బావుల ద్వారా వ్యవసాయం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడి రైతులు కష్టపడి పని చేసే మనస్తత్వం కలవారని, సాగులో కొత్త మెళకువలను తెలుసుకుంటూ ఆధునిక పద్ధతులను అనుసరిస్తున్నారని తెలిపారు.
నీటిని పొదుపుగా వినియోగిస్తూ ఎగుమతి నాణ్యత కలిగిన పంటలను పండిస్తున్న రైతులు నంద్యాల జిల్లా స్థూల దేశీయోత్పత్తి (GDP)లో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా డోన్ నియోజకవర్గం నుంచే జిల్లాకు అత్యధిక గ్రాస్ వాల్యూ యాడెడ్ (GVA) లభిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రాంతంలో నీటి ఎద్దడిని తగ్గించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. తవ్విన బావులు, చెక్ వాల్స్, చెక్ డ్యామ్స్, పొలాల్లో తవ్విన గుంతలు (డగౌట్ పాండ్స్), రాతి కట్టడాలు (రాక్ ఫిల్డ్ డ్యామ్స్), కాంటూర్ ట్రెంచెస్ వంటి నిర్మాణాలు కలిపి ఇప్పటివరకు 1,714 నిర్మాణాలు పూర్తి చేశామని చెప్పారు. అదనంగా మరో 651 నిర్మాణాలకు చర్యలు చేపట్టి భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చెప్పే “మన నీరు – మన సంపద” అనే నినాదాన్ని కార్యరూపం దాల్చే దిశగా రైతులకు నీటి వనరులను అందించేందుకు సమన్వయంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో, ముఖ్యంగా ఈ ప్రాంతంలో గాలి వేగం ఒక ప్రధాన అనుకూల అంశమని కలెక్టర్ తెలిపారు. ఇక్కడ సెకనుకు సుమారు 9 మీటర్ల గాలి వేగం ఉండటంతో విండ్ పవర్ ప్రాజెక్టులకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఐదు విండ్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయబడినట్లు తెలిపారు. మొత్తం 1,567 మెగావాట్ల సామర్థ్యంతో, సుమారు రూ. 9,700 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టులు ఏర్పడినట్లు వివరించారు. ఈ విండ్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించి జూలై 27న ప్రభుత్వం జీవో జారీ చేయగా, డిసెంబర్‌లో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రస్తుతం సుమారు 70 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఈ ఐదు విండ్ పవర్ ప్రాజెక్టుల ద్వారా సుమారు 2,000 మందికి ఉపాధి కల్పించబడిందని తెలిపారు.
ఇక రీ-సర్వే కార్యక్రమం గురించి మాట్లాడుతూ, జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 145 గ్రామాల్లో భూ రీ-సర్వే చేపడుతున్నామని చెప్పారు. డోన్ మండలంలోని 16 గ్రామాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ప్రతి రైతు వద్దకు వెళ్లి గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వ్యాలిడేషన్ సమయంలో వివరాలు సరిచూసి, డ్రాఫ్ట్ ప్లాన్ రికార్డులు సిద్ధం చేసే దశలో వారి వివరాలను ధృవీకరించి ఈ-కెవైసీ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏవైనా పొరపాట్లు ఉన్నట్లయితే వాటిని క్షేత్రస్థాయిలోనే సరిచేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 140 రోజుల్లో ఈ 145 గ్రామాల రీ-సర్వే పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ముఖ్యమంత్రికి వివరించారు.