రిజిస్ట్రేషన్ శాఖకు మంచి పేరు తీసుకురండి
ప్రజలతో మంచి సేవలు అందించండి
డబ్బులు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవు
కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి
కర్నూలు ప్రతినిధి , ఫిబ్రవరి 07, (సీమకిరణం న్యూస్) :
ప్రజలకు మంచి సేవలు అందించి రిజిస్ట్రేషన్ శాఖ కు మంచి పేరు రావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం కలెక్టరేట్ నుండి జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులతో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ పై జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి ప్రజల్లో మంచి అభిప్రాయం లేదని ఐవీఆర్ఎస్ ఫీడ్ బ్యాక్ ద్వారా తెలుస్తోందన్నారు. రిజిస్ట్రేషన్ డిజిటల్ విధానంలో ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ సౌకర్యం ద్వారా చేసుకోవచ్చని ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..డాక్యుమెంట్ రైటర్స్ దగ్గర కానీ మధ్యవర్తుల దగ్గరకు కానీ వెళ్ళకుండా వారికి రిజిస్ట్రేషన్ సౌకర్యం స్లాట్ బుకింగ్ ద్వారా పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుందని ప్రజలకు వివరించాలన్నారు. ప్రజలు ఇతరుల చేతిలో మోసపోకుండా , అధిక మొత్తంలో డబ్బులు చెల్లించకుండా రిజిస్ట్రేషన్ చార్జెస్ ను నోటీసు బోర్డులో ఉంచి వారికి పూర్తి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో కోసిగి , ఆస్పరి , నందవరం , మంత్రాలయం తదితర మండలాలలో సేవలు సరిగా లేవని, అనధికారికంగా డబ్బులు తీసుకుంటున్నారని ఫిర్యాదులు ఉన్నాయని, ఇప్పటినుండి ఇలాంటి ఫిర్యాదులు వస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలో విఆర్వోలు , విలేజ్ సెక్రటరీలను సస్పెండ్ చేయడం జరిగిందని, కావున ప్రజలతో మర్యాదగా వ్యవహరించి వారి దగ్గర నుండి డబ్బులు తీసుకోకుండా రిజిస్ట్రేషన్ సేవలు అందించి జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖకు మంచి పేరు తీసుకుని రావాలని కలెక్టర్ ఆదేశించారు. రిజిస్ట్రేషన్ శాఖలో జరిగే గిఫ్ట్ డీడ్, పార్టిషన్, ట్రాన్స్ఫర్, మార్టుగేజ్ తదితర రిజిస్ట్రేషన్ ప్రక్రియల గురించి చిన్న వీడియోలను తయారుచేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసేలాగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పాంప్లెట్లు తయారు చేసి అన్ని ప్రదేశాల లో పిజిఆర్ఎస్ లు జరుగుతున్న సమయాల్లో ప్రజలకు అందించాలన్నారు. ప్రతి పది రోజులకు ఒకసారి రిజిస్ట్రేషన్ సేవల గురించి స్థానిక దినపత్రికలలో వచ్చేలాగా ప్రెస్ నోట్ లు ఇవ్వాలని , రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవగాహన సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు రిజిస్ట్రేషన్ పై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. పది రోజులకు ఒక సారి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆకస్మిక తనిఖీ లు చేసి సేవలు బాగా అందించే చర్యలు తీసుకోవాలని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ను ఆదేశించారు. జిల్లాలో రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఏవైనా సాంకేతిక సమస్యల ఉంటే తన దృష్టికి తీసుకొని రావాలని, వాటిని విజయవాడ కమీషనరేట్ కు తెలిపి పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ భార్గవ్, జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల అధికారులు పాల్గొన్నారు.