యోగా ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక ధృడత్వం
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనండి
కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు ప్రతినిధి, జూన్ 08, (సీమకిరణం న్యూస్) :

యోగా ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక ధృడత్వం కలుగుతుందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న “యోగాంధ్ర” కార్యక్రమంలో భాగంగా సోమవారం ఓర్వకల్లు మండలంలోని రాక్ గార్డెన్ లో పర్యాటక యోగ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగాను కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రతి ఒక్కరూ తమ శారీరక, మానసిక ఆరోగ్యాభివృద్ధి కోసం స్వచ్ఛందంగా యోగాను అలవాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని గ్రామ స్థాయి వరకు విస్తరించేందుకు ఇప్పటికే 200 మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ అందించామని కలెక్టర్ తెలిపారు. మాస్టర్ ట్రైనర్లు మండల స్థాయి ట్రైనర్లుగా గ్రామ స్థాయి ట్రైనర్లను తయారు చేసి వారి ద్వారా ప్రజలకు యోగా సాధనపై అవగాహన కల్పిస్తారన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలందరూ యోగాంధ్రలో నమోదు చేసుకుని జూన్ 21న నిర్వహించే మెగా యోగా కార్యక్రమంలో పాల్గొని సర్టిఫికెట్లు పొందాలని కలెక్టర్ కోరారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లాలో పర్యాటక ప్రదేశాల్లో కూడా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. రాక్ గార్డెన్‌లో సుమారు 500 మంది పాల్గొనగా, జిల్లాలో ఎంపిక చేసిన 6 ప్రధాన దేవాలయాల్లో కూడా యోగా ప్రదర్శనలు, సామూహిక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. యోగాంధ్రలో భాగంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో యోగా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన ప్రతిభావంతులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. విజేతలు సర్టిఫికెట్లు, బహుమతులు అందుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రస్తుత జీవనశైలి, ఉద్యోగ బాధ్యతలు, లక్ష్యాల ఒత్తిడి కారణంగా ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, మానసిక ఒత్తిడి ఉన్నంత మాత్రాన మనోధైర్యాన్ని కోల్పోకూడదని కలెక్టర్ పేర్కొన్నారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక దృఢత్వం కూడా ఎంతో ముఖ్యమని, అందుకోసం ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం, ప్రాణాయామాన్ని తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. రోజుకు కనీసం 10 నిమిషాల పాటు ప్రాణాయామం చేసినా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.. కేవలం కష్టపడి పనిచేయడం మాత్రమే కాకుండా స్మార్ట్ వర్క్ చేయడం కూడా అవసరమని కలెక్టర్ తెలిపారు. జీవితంలో ఎన్నో బాధ్యతలు, లక్ష్యాలు, పనులు ఉంటాయని, వాటిని ప్రాధాన్యతల ఆధారంగా ప్రణాళికాబద్ధంగా నిర్వహించుకుంటే ఒత్తిడి తగ్గుతుందన్నారు. ఈరోజు చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేయకుండా సమయానికి పూర్తి చేయడం అలవాటు చేసుకోవాలన్నారు. పనులను వాయిదా వేయడం వల్ల ఒత్తిడి పెరిగి, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధంగా పనిచేయడం, పనులకు ప్రాధాన్యత కేటాయించడం, కుటుంబ సభ్యులతో సమయం గడపడం వంటి అంశాలు మానసిక ప్రశాంతతకు ఎంతో దోహదపడతాయని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ తమకు ఆనందం, ప్రశాంతతను కలిగించే అంశాలను గుర్తించి జీవితంలో పాటించాలన్నారు. ముందుగా డాక్టర్ అబ్దుల్ కలాం మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన అడ్వాన్స్ యోగ కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డిఆర్ఓ సి. వెంకట నారాయణమ్మ, టూరిజం రీజినల్ డైరెక్టర్ ఓబులమ్మ, జిల్లా పరిషత్ సీఈఓ రమణా రెడ్డి, డి ఆర్ డి ఏ పిడి రమణా రెడ్డి, డ్వామా పిడి నరసింహ రెడ్డి, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, డిపిఓ భాస్కర్, సెట్కూర్ సీఈవో వేణుగోపాల్, టూరిజం అధికారి లక్ష్మీ నారాయణ, యోగంధ్ర ఆయుష్ జిల్లా నోడల్ అధికారి డా. అమర్నాథ్, ఆయుష్ మెడికల్ అధికారి చంద్రిక, సీనియర్ వైద్యులు డా. కే. వి.ఎన్ ప్రసాద్, రాష్ట్ర యోగ సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్, జిల్లా యోగ సంఘం ప్రధాన కార్యదర్శి మునిస్వామి, తదితరులు పాల్గొన్నారు.