మున్సిపల్ కమిషనర్ పి.విశ్వనాథ్ బదిలీ
కర్నూలు నూతన మున్సిపల్ కమిషనర్ గా చల్లా ఓబులేసు
కర్నూలు ప్రతినిధి, ఏప్రిల్ 16, (సీమకిరణం న్యూస్):
కర్నూలు మున్సిపల్ కమిషనర్ పి.విశ్వనాథ్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం జీవో నెంబర్ 414 జారీ చేసింది. ఆయన స్థానంలో చల్లా ఓబులేసును నియమించింది. కాగా గతేడాది జులై 11న కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన పి.విశ్వనాథ్, 9 నెలల పాటు నగరానికి సేవలు అందించారు. నగర ప్రజల ఆశలకు, ఆకాంక్షలను అనుగుణంగా పనితీరు కనబరిచారు. పారిశుద్ధ్యం, పచ్చదనం, మౌలిక సదుపాయాల కల్పన, వినూత్న కార్యక్రమాలతో అనతి కాలంలోనే నగర ప్రజల్లో మెప్పు పొందారు. నగరంలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రైవేటు స్థలాల్లో పదుల సంఖ్యలో జెసిబిలతో పిచ్చి మొక్కల తొలగింపు చేపట్టడంతో పాటు గుత్తేదారులకు ఒకేసారి రూ. 18 కోట్లు, మరోసారి రూ.11 కోట్ల బిల్లులను చెల్లింపులు చేశారు. బుధవారపేట మెడికల్ కాలేజీ వద్ద మలుపు విస్తరణ వంటి దశాబ్దాల సమస్య పరిష్కారంలో కీలక పాత్ర పోషించి రాష్ట్ర స్థాయి వార్తల్లో నిలిచారు. దామోదరం సంజీవయ్య కూడలి నుంచి ఎస్ఎస్ గార్డెన్స్ వరకు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.30 కోట్లతో రహదారులు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులను ప్రారంభించారు. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం, బాధ్యతాయుతంగా వ్యవహరించేందుకు క్రమశిక్షణలు తీసుకుని కొన్ని విభాగాలను ప్రక్షాళన చేశారు. అవినీతి నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. తొలిసారి ఆర్వో, శానిటేషన్ ఇన్స్పెక్టర్లుగా మహిళలకు అవకాశం కల్పించారు. మున్సిపల్ కార్యాలయంలో ఫీడింగ్ రూం, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్యం, పచ్చదనంపై ప్రత్యేక దృష్టి సారించారు. ‘కర్నూలుకు హరితహారం’ పేరుతో విడతల వారీగా 30 వేల మొక్కలు నాటించి గ్రీన్ సిటీకి నాంది పలికారు. అందులో ఒకేసారి 6 వేల మొక్కలను సచివాలయాల్లో ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. గార్బేజ్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి చెత్త వేయడంపై కఠిన చర్యలు చేపట్టారు. రాత్రివేళల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తూ ప్రతి వీధి గోడలపై సిబ్బంది వివరాలు అందుబాటులో ఉంచి ప్రజల భాగస్వామ్యాన్ని పెంచారు. యువత, విద్యార్థుల సహకారంతో విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్థిక వనరుల సమీకరణపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఎల్ఆర్ఎస్, బిపియస్, పన్ను వసూళ్లను ప్రతిరోజూ సమీక్షిస్తూ లక్ష్యాలను సాధించారు. విస్తరిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన ఆదాయం సమకూర్చేందుకు చర్యలు చేపట్టారు. స్మార్ట్ సిటీ కింద పార్కులు, సెంట్రల్ మిడియన్స్ అభివృద్ధికి చొరవ చూపించారు. కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతన బిల్లులను ప్రతి నెల 20వ తేదీకే పంపేలా చర్యలు తీసుకున్నారు. గుత్తేదారులు, ఏజెన్సీల ద్వారా పనిచేసే కార్మికులకు నెలనెలా వేతనాలు అందేలా చూసారు. పారిశుద్ధ్య కార్మికుల కోసం రూ.82 లక్షలతో 21 రకాల పరికరాలు కొనుగోలు చేశారు. పండుగలు, ఉత్సవాల సందర్భాల్లో కార్మికులను ప్రోత్సహించారు. నగర అభివృద్ధిలో భాగంగా నూతన కార్యాలయ పనులను వేగవంతం చేసి తాత్కాలిక కార్యాలయాన్ని తరలించారు. కుక్కల బెడద నివారణకు తాత్కాలిక డాగ్ షెల్టర్ ఏర్పాటు చేసి సంతాన నిరోధక చికిత్సలను పెంచారు. నగర కూడళ్లలో బ్యానర్లు, పోస్టర్ల నిషేధాన్ని కఠినంగా అమలు చేశారు. కొత్త కూడళ్ల ఏర్పాటు, కుదింపు పనులు చేపట్టారు. ఈట్ స్ట్రీట్లు, వెండర్ జోన్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు. జగన్నాథ గుట్టపై టిడ్కో గృహాలను మరమ్మత్తులు పూర్తి చేసి వందలాది పేదలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. గృహాల కోసం డిడీలు కట్టిన వారికి తిరిగి చెల్లింపుల కోసం ప్రభుత్వంనుంచి నిధులు మంజూరు చేయించారు. భవన నిర్మాణ వ్యర్థాలను శాస్త్రీయంగా సేకరించే విధానాన్ని అమలు చేశారు. గడియారం ఆసుపత్రి అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థల సహకారంతో చర్యలు చేపట్టారు. ప్రజలతో నేరుగా మమేకమయ్యే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రతి సోమవారం పీజీఆర్ఎస్, ప్రతినెలా డయల్ యువర్ కమిషనర్, ప్రతి శుక్రవారం ఓపెన్ ఫోరం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనను విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. వచ్చిన కొత్తలో సంతోష్ నగర్ వద్ద పైప్లాన్ లీకేజీ సమస్యను అత్యవసరంగా పరిష్కరించి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ట్యాంకర్ల ద్వారా పక్కా ప్రణాళిక ద్వారా తాగునీటి సరఫరా చేశారు. నిపుణుల సహాయంతో చాకచక్యంగా లీకేజీలను సమర్థవంతంగా నివారించారు.