తెలంగాణ
ఓయి-లింగారెడ్డి గజ్జల
ఆ ఇద్దరూ కవలలు.. వారు పెళ్లాడిన వారు కూడా కవలలే! అచ్చం ఒకే పోలికలతో ఉన్న రెండు జంటలు ఒక్కటైన వేళ.. ఆ ఊరంతా అరుదైన వేడుకను చూసి మురిసిపోయింది. సరిగ్గా ‘మూడుట్విన్స్ డే’ రోజే ముళ్ళ బంధంతో ఒక్కటైన ఆ అపూర్వ జంటల జీవితంలో వెలుగులు నిండాయి అందరూ భావించారు. కానీ, విధి ఆడిన వింత నాటకంలో నెల రోజులు గడవకముందే ఒక జంటలో విషాదం నిండింది. నవ వరద చెరువులో శవమై తేలడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది.
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన దుంపటి విజయ్, వినయ్ అనే కవల సోదరులు.. తాడ్వాయి మండలానికి చెందిన కీర్తన, కీర్తి అనే కవల సోదరీమణులను గత నెల 22న వివాహం చేసుకున్నారు. పోలికలున్న వారు ఒకే ఇంట్లోకి కోడళ్లుగా రావడం అప్పట్లో పెద్ద సంచలనం.

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వినయ్ కుమార్, ఉగాది పండుగ కోసం తన స్వగ్రామమైన ఘన్‌పూర్‌కు వచ్చాడు. పండుగ పూట అందరితో కలిసి సరదాగా గడిపిన వినయ్.. “బయటకు వెళ్లి వస్తాను” అని ఇంట్లో చెప్పి వెళ్లాడు. కానీ, ఆ వెళ్లడమే చివరి పయనమవుతుందని ఆ కుటుంబం ఊహించలేదు.
మానేరు డ్యామ్‌లో విషాద ముగింపు…
బయటకు వెళ్లిన వినయ్ రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో గాలించారు. చివరకు గంభీరావుపేట మండలం నర్మాల గ్రామ శివారులోని మానేరు డ్యామ్‌లో వినయ్ మృతదేహం లభ్యమైంది. అప్పటివరకు పండుగ సందడితో ఉన్న ఆ ఇంట ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. పెళ్లైన రోజుల్లోనే, అది కూడా ఉగాది పండుగ రోజే వినయ్ నెలరోజుల ఆత్మహత్య ఘటన వెనుక ఉన్న కారణాలేమిటన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది.
నిజానిజాల వేటలో పోలీసులు..
వినయ్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా స్థిరపడి, అప్పుడే పెళ్లయిన యువకుడు ఇంతటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? ఏదైనా మానసిక ఒత్తిడా లేక ఇతర కారణాలున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు గంభీరావుపేట పోలీసులు కేసు నమోదు చేసి, వినయ్ సెల్ ఫోన్ డేటా ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు.

