- హత్య కేసులో ముగ్గురు ముద్దాయిల అరెస్ట్
నేరానికి ఉపయోగించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం
కర్నూలు క్రైమ్, ఆగస్టు 18 (సీమకిరణం న్యూస్):
కర్నూలు ఒకటవ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేశారు. నేరానికి ఉపయోగించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌తో పాటు మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన ముద్దాయిలు
1. షేక్ ఇమ్రాన్ (38) – గనిగల్లీ, కర్నూలు టౌన్
2. మహమ్మద్ జవాద్ (25) – 1 టౌన్ ఏరియా, కర్నూలు టౌన్
3. S.M.D. ఇర్ఫాజ్ (27) – మొగల్‌పుర వీధి, కర్నూలు టౌన్
పోలీసుల వివరాల ప్రకారం.. 2026 ఆగస్టు 7వ తేదీ అర్ధరాత్రి సుమారు ఒంటిగంట సమయంలో కర్నూలు టౌన్‌లోని మాసుం బాషా దర్గా సమీపంలోని టీ స్టాల్ వద్ద షేక్ ఇంతియాజ్‌పై నిందితులు దాడి చేశారు. అతడిని చంపాలనే ఉద్దేశంతో ఛాతిపై గుద్ది, తలపై బండరాయితో విచక్షణారహితంగా మోది తీవ్ర రక్తగాయాలు కలిగించడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తమ్ముడు షేక్ ఇలియాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు 1 టౌన్ పోలీసులు Cr.No.78/2026, సెక్షన్లు 103, 49 r/w 3(5) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముద్దాయిల కోసం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, IPS ఆదేశాల మేరకు, కర్నూలు డీఎస్పీ K.V. రాఘవేంద్ర ఆధ్వర్యంలో కర్నూలు 1 టౌన్ పోలీస్‌స్టేషన్ సీఐ జి. మారుతి శంకర్, కోడుమూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ M. తబ్రేజ్ మరియు సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు ఆగస్టు 17న మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో కర్నూలు టౌన్ జొహరాపురం పక్కీ మసీదు వద్ద ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేశారు. వారిలో ఒకరి వద్ద నేరానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్, మరొకరి వద్ద AP40-DY-09803 రిజిస్ట్రేషన్ నంబర్ గల రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అదే రోజు సాయంత్రం 6.30 గంటల సమయంలో జొహరాపురం ఇందిరమ్మ గృహాల వద్ద మరో ముద్దాయిని అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన మరో మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మూడు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్టయిన ముగ్గురు ముద్దాయిలను కర్నూలు గౌరవనీయ జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపరచగా, కోర్టు వారిని సెప్టెంబర్ 1, 2026 వరకు జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. హత్య కేసును సత్వరం ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు.