బద్వేలు భూ వివాదంపై తప్పుడు ప్రచారం..
మహిళ జాకెట్ చింపిన ఘటన జరగలేదు : డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్
కడప / బద్వేలు, జూలై 20 (సీమకిరణం న్యూస్):
వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు పట్టణంలోని మార్తోమా నగర్‌లో చోటుచేసుకున్న వృద్ధ దంపతుల భూ వివాద ఘటనలో మహిళ రవిక (జాకెట్) చింపినట్లు సామాజిక మాధ్యమాలు, కొన్ని ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని మైదుకూరు డీఎస్పీ జి. రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. బద్వేలుకు చెందిన పిన్నం వెంకటయ్య మరియు ప్రొద్దుటూరుకు చెందిన అయ్యవారమ్మ తదితరుల మధ్య మార్తోమా నగర్‌లోని 3 సెంట్ల ఇంటి స్థలంపై కొంతకాలంగా భూ వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో జూలై 18 సాయంత్రం పిన్నం వెంకటయ్యకు, ఆ స్థలాన్ని అయ్యవారమ్మ వద్ద కొనుగోలు చేసినట్లు చెప్పబడుతున్న కడపకు చెందిన బొజ్జా తిరుమలేష్ తదితరుల మధ్య వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే బద్వేలు టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి, ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించి శాంతిభద్రతలను పునరుద్ధరించారు. ఈ ఘటనపై బద్వేలు అర్బన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం.106/2026, BNS సెక్షన్ 194(2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళ జాకెట్ చించి అవమానించారంటూ కొన్ని టెలివిజన్ ఛానళ్లలో, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగడంపై పోలీసులు విచారణ చేపట్టగా, మహిళ దుస్తులు చింపడం గానీ, ఆమెను అవమానించే విధంగా ఎలాంటి ఘటన గానీ జరగలేదని తేలిందని డీఎస్పీ తెలిపారు. భూ వివాదాన్ని వక్రీకరించి మహిళ గౌరవానికి భంగం కలిగించినట్లు తప్పుడు ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో అపోహలు, విద్వేషాలు పెరిగే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఇటువంటి అసత్య, కల్పిత, రెచ్చగొట్టే కథనాలను ప్రచారం చేయడం లేదా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం చట్టరీత్యా శిక్షార్హమైన చర్య అని స్పష్టం చేశారు. ప్రజలు, మీడియా ప్రతినిధులు ఏ సమాచారాన్నైనా సంబంధిత అధికారుల ద్వారా ధృవీకరించుకున్న తర్వాతే ప్రచారం చేయాలని, నిరాధార వార్తలను నమ్మకుండా, వాటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డీఎస్పీ జి. రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.