seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 18 February 2026, 3:13 pm Digital Edition : SEEMA KIRANAM

బ్రహ్మగుండేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు విజయవంతం

బ్రహ్మగుండేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు విజయవంతం

హుండీ ఆదాయం రూ. 2.19222 లక్షలు

వెల్దుర్తి, ఫిబ్రవరి 18, (సీమకిరణం న్యూస్) :

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండల పరిధిలోని బ్రహ్మగుండేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన నాలుగు రోజుల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక హుండీని బుధవారం లెక్కించారు. చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ హనుమంతరావు, ఈవో ఆంజనేయులు, ఉత్సవ కమిటీ నిర్వాహకుడు బొమ్మన రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించారు. ఆలయ సిబ్బంది, భక్తుల సమక్షంలో హుండీని తెరిచి నగదు లెక్కింపు చేపట్టారు. అధికారుల వివరాల ప్రకారం ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాల హుండీ ద్వారా మొత్తం రూ. 2,19,222 ఆదాయం నమోదైంది. ఇది గత ఏడాదితో పోలిస్తే రూ. 86,500 మేర అధికమని వారు తెలిపారు. భక్తుల విశ్వాసం, బ్రహ్మోత్సవాల పట్ల పెరిగిన స్పందన కారణంగానే ఈ ఆదాయం పెరిగిందని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాదిమంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు హుండీ ఆదాయాన్ని వినియోగించనున్నట్లు అధికారులు వెల్లడించారు.