బోగోలు రైతులకు రాయితీపై వేరుశనగ విత్తనాల పంపిణీ
వెల్దుర్తి మండల వ్యవసాయ అధికారి ఆర్. అక్బర్ బాషా
వెల్దుర్తి, జూలై 11, (సీమకిరణం న్యూస్):
వెల్దుర్తి మండలం బోగోలు గ్రామ రైతులకు సామూహిక ప్రదర్శన క్షేత్రాల కింద అంతర్జాతీయ ఆహార నూనెల మిషన్ – నూనె గింజలు (NMEO-OS) పథకం ద్వారా వేరుశనగ సాగు చేయనున్న రైతులకు నూతన వేరుశనగ రకం టీసీజీఎస్ 1694 విత్తనాలను రాయితీపై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి ఆర్. అక్బర్ బాషా మాట్లాడుతూ.. విత్తనాలు పొందిన ప్రతి రైతు తప్పనిసరిగా తన పంట పొలాల్లో వాటిని సాగు చేసుకోవాలని, రాబోయే సీజన్‌లో ఇదే విత్తనాన్ని మూల విత్తనంగా వినియోగించాలని సూచించారు. విత్తనాలతో పాటు చిరుపోషకాలు, విత్తన శుద్ధి కోసం ట్రైకోడెర్మా విరిడి మందులను కూడా రాయితీపై రైతులకు అందజేశారు. అనంతరం బోగోలు గ్రామంలో జరుగుతున్న పంట నమోదు కార్యక్రమాన్ని వ్యవసాయ అధికారి పరిశీలించారు. భూమిలో తగినంత తేమ శాతం ఉన్నప్పుడు మాత్రమే విత్తనాలు విత్తుకోవాలని రైతులకు సూచించారు. మండలంలోని రైతు సేవా కేంద్రాల్లో రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల వ్యవసాయ అధికారి ఆర్. అక్బర్ బాషాతో పాటు రైతు సేవా కేంద్రం సిబ్బంది రామానంద్, భువనేశ్వరి, అమర్నాథ్ గౌడ్, మాజీ సర్పంచ్ తదితరులు, రైతులు పాల్గొన్నారు.