కర్నూలు చైన్ స్నాచింగ్ కేసు ఛేదించిన నాలుగో పట్టణ పోలీసులు
రూ.1.40 లక్షల నగదు స్వాధీనం
సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలతో నిందితుల గుర్తింపు
పాట్నాలో ప్రత్యేక బృందం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు
కర్నూలు క్రైమ్, జూలై 24, (సీమకిరణం న్యూస్):
కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించి, ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి బంగారు గొలుసు విక్రయించి వచ్చిన రూ.1,40,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. గత నెల ఉల్చాల రోడ్డులోని ఆదిత్యనగర్‌లో ఓ వివాహిత ఉదయం పాల ప్యాకెట్ కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వస్తుండగా, మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలో ఉన్న సుమారు రెండు తులాల బంగారు పుస్తెల గొలుసును లాక్కొని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, సీఐ విక్రమ్ సింహ ఆధ్వర్యంలో సాంకేతిక ఆధారాలు, బీహార్ రాష్ట్ర క్రైమ్ డిటెక్టివ్ బృందాల సహకారంతో దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిందితులు బీహార్ రాష్ట్రం పాట్నాలోని బకార్గంజ్‌కు చెందిన రవి కుమార్ కేశరి మరియు దీప్ కుమార్ @ అంకిత్ శర్మలుగా గుర్తించారు. ఎస్‌ఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్‌ఐ పోసా శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్ జీనస్, పీసీలు శ్రీనివాసులు, మురళీధర్లతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పాట్నాలో నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు బంగారు గొలుసును విక్రయించగా వచ్చిన రూ.1,40,000 నగదును స్వాధీనం చేసుకుని, వారిని రిమాండ్ నిమిత్తం గౌరవ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.