seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 12:50 pm Digital Edition : SEEMA KIRANAM

ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా గౌరీ గోపాల్ హాస్పిటల్‌లో ఉచిత మెగా వైద్య శిబిరాలు

ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా గౌరీ గోపాల్ హాస్పిటల్‌లో ఉచిత మెగా వైద్య శిబిరాలు

 

కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 16, (సీమకిరణం న్యూస్):

ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. తన తండ్రి, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి నెలా 16వ తేదీన కర్నూలులోని గౌరీ గోపాల్ హాస్పిటల్‌లో కర్నూలు నియోజకవర్గ ప్రజల కోసం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. సుమారు 127 మంది ఈ శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరంలో సుమారు రూ.6,000 విలువైన వైద్య పరీక్షలను ఉచితంగా అందించారు. రక్తపరీక్షలు, ఆర్‌బీఎస్, ఈసీజీ, 2డీ ఎకో, టీఎంటీ, అల్ట్రాసౌండ్ స్కాన్/కేయూబీ, ఛాతీ ఎక్స్‌రే/కేయూబీతో పాటు చిన్నపిల్లల వైద్యులు, గుండె వైద్య నిపుణులు, కంటి వైద్య నిపుణులు, దంత వైద్యుల సేవలను ఉచితంగా అందించారు. వైద్య పరీక్షల్లో 6 మందికి గుండె సంబంధిత సమస్యలు, 9 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించినట్లు మంత్రి తెలిపారు. ప్రజలకు ఉన్న అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి, సకాలంలో చికిత్స అందేలా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. అనారోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే పెద్ద ప్రమాదాలను నివారించవచ్చని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. ప్రజలు ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలన్నదే తమ లక్ష్యమన్నారు. గతంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాల ద్వారా కూడా ఎంతోమందిలో అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించినట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను నిరంతరం నిర్వహిస్తామని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు.