seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 09 May 2026, 11:30 am Digital Edition : SEEMA KIRANAM

పుట్టపర్తిలో అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్‌ ప్రారంభం

పుట్టపర్తిలో అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్‌ ప్రారంభం

 

సేవే పరమావధి… ఉచిత వైద్యంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న సత్యసాయి ఆస్పత్రి

 

పుట్టపర్తి, మే 09, (సీమకిరణం న్యూస్) :

 

దేశంలోని చాలా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో లక్షల్లో ఖర్చయ్యే గుండె చికిత్సలు ఇక్కడ పూర్తిగా ఉచితం. పుట్టపర్తి నుంచి ప్రపంచానికి మానవతా సందేశం. నిన్నటి రోజున అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్‌ ప్రారంభంతో మరో మైలురాయిని చేరుకొంది. శ్రీ సత్యసాయి ఇనిస్ట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ పేరు చెప్పగానే పేదలకు ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్యం గుర్తుకు వస్తుంది. “డబ్బు లేక చికిత్స ఆగకూడదు” అనే దివ్య సంకల్పంతో శ్రీ సత్యసాయి బాబా గారు ప్రారంభించిన ఈ వైద్యసేవా యజ్ఞం మూడు దశాబ్దాలుగా లక్షలాది కుటుంబాలకు ప్రాణాధారంగా నిలుస్తోంది. అత్యాధునిక సాంకేతికత, ప్రపంచస్థాయి వైద్య సేవలు, పూర్తిగా ఉచిత చికిత్స ఈ మూడు అంశాలను సమన్వయం చేస్తూ పుట్టపర్తి ప్రశాంతిగ్రామంలోని ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రత్యేక గుర్తింపు పొందింది. తాజాగా మరో అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్ ప్రారంభం కావడం ద్వారా సేవల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.

 

రూ.3.78 కోట్లతో ఆధునిక క్యాథ్ ల్యాబ్….!!!!

 

ఆసుపత్రిలో రూ.3.78 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన “షిమాడ్జు ట్రినియాస్ C-12” కార్డియాక్ క్యాథెటరైజేషన్ ల్యాబ్‌ను శ్రీ సత్యసాయి ట్రస్టు సభ్యులు ఆర్ జే రత్నాకర్ గారు ప్రారంభించారు. రెండేళ్ల వ్యవధిలో ఆసుపత్రిలో ప్రారంభమైన రెండో అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ఇదే కావడం విశేషం. హృద్రోగ నిర్ధారణ, చికిత్సల్లో కీలకమైన ఈ ల్యాబ్‌లో కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత ఇమేజ్ ప్రాసెసింగ్ వ్యవస్థను వినియోగిస్తున్నారు. సూక్ష్మ రక్తనాళాల వరకు స్పష్టంగా గుర్తించే సామర్థ్యం ఉండటంతో క్లిష్టమైన గుండె చికిత్సలు మరింత ఖచ్చితత్వంతో నిర్వహించే అవకాశం ఏర్పడింది. రోగికి భద్రత.. వైద్యుడికి సౌలభ్యం. “PISA” ఆధారిత SCORE Opera ఇమేజింగ్ టెక్నాలజీ వల్ల రేడియేషన్ ప్రభావం తగ్గుతుంది. C-arm రోటేషన్ వ్యవస్థ ద్వారా వైద్యులు వేగంగా, సులభంగా పరీక్షలు నిర్వహించగలుగుతున్నారు. అత్యాధునిక సాంకేతికతను పూర్తిగా సేవా దృక్పథంతో వినియోగించడం ఈ ఆసుపత్రి ప్రత్యేకతగా నిలుస్తోంది. ఆసుపత్రి కార్డియాలజీ విభాగం ఇప్పటివరకు సుమారు 16 లక్షల మందికి కన్సల్టేషన్లు నిర్వహించింది. వేలాది గుండె శస్త్రచికిత్సలు, క్లిష్ట వైద్య ప్రక్రియలను పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తూ పేదలకు ఆశాకిరణంగా మారింది.

 

డబ్బు కాదు… దయే ప్రధాన మూలధనం…!!!!

 

దేశంలోని చాలా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో లక్షల్లో ఖర్చయ్యే గుండె చికిత్సలు ఇక్కడ పూర్తిగా ఉచితం. కులం, మతం, జాతి, ఆర్థిక స్థితి అనే తేడాలు లేకుండా ప్రతి రోగిని సమానంగా చూసే విధానం ఈ ఆసుపత్రిని విశిష్టంగా నిలబెడుతోంది. ఇక్కడికి వచ్చే రోగులు కేవలం చికిత్స మాత్రమే కాదు… ఆత్మీయత, ఆదరణ, మానవత్వాన్ని కూడా అనుభవిస్తారు. సేవలో ఆధ్యాత్మికతను కలిపిన అరుదైన వైద్య సంస్థగా ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

 

“లవ్ ఆల్… సర్వ్ ఆల్” ఆచరణలో …!!!!

 

శ్రీ సత్యసాయి బాబా గారు బోధించిన “Love All – Serve All” తత్వాన్ని ఈ ఆసుపత్రి ప్రతిరోజూ ఆచరణలో చూపిస్తోంది. డబ్బు సంపాదన కాదు… మానవ సేవే లక్ష్యంగా వైద్య వ్యవస్థ నడవగలదని నిరూపిస్తోంది. పుట్టపర్తిలో ప్రారంభమైన ఈ సేవా యజ్ఞం… నేటికీ వేలాది పేద కుటుంబాల గుండెల్లో ఆశగా, విశ్వాసంగా నిలిచింది. ఇక్కడ గుండె సంబంధిత చికిత్సలతో పాటు ఎముకలు కు సంబంధించిన విభాగం కూడా విస్తృతంగా సేవలు అందిస్తున్నది. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.

Screenshot

డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి MS MCh

గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు

ప్రభుత్వ సర్వజన వైద్యశాల. కర్నూలు.