తెలంగాణ
ఓయి-లింగారెడ్డి గజ్జల
కన్నతల్లే యమపాశమైతే.. రక్షణగా ఉండాల్సిన ప్రాణమే రాక్షసిగా మారితే.. ఆ పసిపాప ఆర్తనాదాలు ఎవరికి వినపడాలి? హైదరాబాద్ శివారు బౌరంపేట్‌లో జరిగిన ఒక హృదయ విదారక ఘటన మాతృత్వానికే మాయని మచ్చలా మిగిలిపోయింది. రెండు నెలల పసికందును ఆ తల్లి చేసిన క్రూరత్వం వింటే రాతి గుండె కూడా కరిగి నీరవ్వాల్సిందే.
అమ్మ పొత్తిళ్లలో వెచ్చగా నిద్రపోవాల్సిన ఆ చిన్నారికి, తల్లి చేతులు రగిల్చిన చితి మంటలు ఎదురవుతున్నప్పుడు ఊహించలేకపోయాడు. మధ్యప్రదేశ్ నుంచి పొట్ట చేతబట్టుకుని వలస వచ్చిన రాజేంద్ర, మమత దంపతులు హైదరాబాద్ దుండిగల్ బౌరంపేటలోని ఒక అపార్ట్మెంట్ నిర్మాణ పనుల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం తండ్రి పనిలోకి వెళ్లగా, ఆ రెండు నెలల పసిగుడ్డు తల్లి దగ్గరే ఉన్నాడు. లోకమే తెలియని ఆ పసివాడు ఆకలికో, ఆవేదనకో గుక్కపెట్టి ఏడ్చాడు. ఆ ఏడుపు ఆ తల్లిలో కనికరాన్ని పెంచాల్సింది పోయి, కసాయి తనను రగిల్చింది.

ఆ పసివాడి కేకలు వినేవారెవరు?
ఏడుస్తున్నాడన్న కోపంతో ఆ కన్నతల్లి అమానుషానికి ఒడిగట్టింది. పసివాడు కేకలు వేయకుండా ఉండాలని నోటిలో గుడ్డలు కుక్కి, తప్పించుకోకుండా కాళ్లు కట్టేసింది. ఆపై ఏకంగా వెలుగుతున్న కట్టెల పొయ్యిలో ఆ పసి ప్రాణాన్ని పడేసింది. నిప్పుల సెగకు ఆ పసి గుండె ఎంతలా విలవిలలాడి ఉంటుందో.. ఆ మంటల వేడికి ఆ సుకుమారమైన దేహం ఎంతలా మాడిపోయి ఉంటుందో తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. లోకంలోకి వచ్చి రెండు నెలలు కూడా గడవకముందే, కన్నతల్లి చేతుల్లోనే ఆ ప్రాణం బూడిదైపోయింది.
కళ్లముందే కాలిపోతున్న కొడుకు.. తండ్రి ఆర్తనాదం
మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన తండ్రి రాజేంద్రకు ఎదురైన దృశ్యం చూపించింది. కట్టెల పొయ్యిలో తన కొడుకు కాలిపోతుండటం, పక్కనే భార్య నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడం చూసి అతను కుప్పకూలిపోయాడు. తన బిడ్డను రక్షించుకుందామన్నా అప్పటికే ఆ చిన్నారి బొగ్గులా మారిపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో దుండిగల్ పోలీసులు అక్కడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
తల్లి ప్రేమను చాటాల్సిన చేతులతోనే, తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను చితికి ఆహుతి చేసిన ఈ ఘోరకలి చూసి స్థానికులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ” అమ్మ” అనే పదానికే మాయని మచ్చ తెచ్చిన ఈ మాతృరూప రాక్షసి చేసిన పని అందరినీ కలిచివేస్తోంది.

