seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 13 November 2026, 2:03 pm Digital Edition : SEEMA KIRANAM

పదవి కోసం కాదు.. ప్రజలకు సేవ చేసేందుకే వచ్చా!

పదవి కోసం కాదు.. ప్రజాసేవే నా లక్ష్యం!

 

గెలుపోటములతో సంబంధం లేదు.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటా!

 

మసీదు అభివృద్ధికి ఆర్థిక సాయం.. పేదల శుభకార్యాలకు ఉచిత వంట సామగ్రి

 

 

వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి, ప్రముఖ వ్యాపారవేత్త తిరువీధి రమేష్

 

 

 ముస్లిం సోదరులతో ఆత్మీయ సమావేశం

 

 

వెల్దుర్తి నజీర్, నవంబర్ 13 (సీమకిరణం న్యూస్):

 

సర్పంచ్ పదవి కోసం తాను ఎన్నికల బరిలోకి రాలేదని, గ్రామ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే పోటీ చేస్తున్నానని వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి, ప్రముఖ వ్యాపారవేత్త తిరువీధి రమేష్ పేర్కొన్నారు. శుక్రవారం వెల్దుర్తి పట్టణంలోని జామియా మసీదును సందర్శించిన సర్పంచ్ అభ్యర్థి తిరువీధి రమేష్, నమాజ్ అనంతరం ముస్లిం సోదరులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం కోసం కాకుండా ప్రజల సమస్యలను పరిష్కరించి గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేయాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలు తనను రాజకీయ నాయకుడిగా కాకుండా తమ కుటుంబ సభ్యుడిగా, గ్రామ సేవకుడిగా భావించాలని కోరారు.

 

గెలుపోటములతో సంబంధం లేకుండా మసీదు అభివృద్ధికి సహకారం

 

మసీదు అభివృద్ధి విషయంలో గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని తిరువీధి రమేష్ తెలిపారు. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా మసీదు స్లాబ్ నిర్మాణానికి రూ.లక్ష విరాళంగా అందిస్తానని ప్రకటించారు. తాను సర్పంచ్‌గా ఎన్నికైతే స్లాబ్ నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా మసీదుకు అవసరమైన మూడు సెట్ల స్థలం కేటాయింపు విషయంలోనూ తన వంతు పూర్తి సహకారం అందిస్తానని వెల్లడించారు. మత సామరస్యం, సోదరభావం, అన్ని వర్గాల అభివృద్ధికి తాను ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు.

 

పేదల శుభకార్యాలకు ఉచితంగా వంట సామగ్రి

 

గ్రామంలోని పేద, మధ్యతరగతి కుటుంబాల్లో వివాహాలు, ఇతర శుభకార్యాలు నిర్వహించుకునే సమయంలో ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు రమేష్ తెలిపారు. ఇందుకోసం భారీ వంట పాత్రలు, బేసన్లు, బకెట్లు, గ్యాస్ స్టవ్‌లు, 100 కుర్చీలను ఇప్పటికే హైదరాబాద్‌లో ఆర్డర్ ఇచ్చినట్లు వెల్లడించారు. త్వరలోనే వాటిని గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని, అవసరమైన ప్రతి ఒక్కరూ ఎలాంటి అద్దె చెల్లించకుండా ఉచితంగా వినియోగించుకోవచ్చని చెప్పారు. పేద కుటుంబాలకు ఈ సామగ్రి ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

అవినీతికి తావులేని పారదర్శక పాలన అందిస్తా

 

గ్రామంలో అభివృద్ధి పనులు, ఇళ్ల నిర్మాణాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి అవినీతికి తావులేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తానని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని, గ్రామంలో తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.

 

అర్ధరాత్రి అయినా ప్రజలకు అందుబాటులో ఉంటా

 

గ్రామ ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా పగలు, రాత్రి అనే తేడా లేకుండా తనను సంప్రదించవచ్చని తిరువీధి రమేష్ పేర్కొన్నారు. అర్ధరాత్రి సమయంలోనైనా ప్రజల సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. అల్లా దయతో, గ్రామ పెద్దల ఆశీస్సులతో ప్రజలు తనకు అవకాశం కల్పిస్తే పదవిని అధికారంగా కాకుండా బాధ్యతగా భావించి గ్రామ సేవకుడిగా పనిచేస్తానని స్పష్టం చేశారు. మాటలతో కాకుండా చేతల్లో సేవ చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన ఆకాంక్ష అని తిరువీధి రమేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.