seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 28 August 2026, 1:18 pm Digital Edition : SEEMA KIRANAM

నేరస్తులకు సింహస్వప్నం..

నేరస్తులకు సింహస్వప్నం..

 

నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో సీఐ విక్రమ్ సింహా మార్క్.!

 

క్రైమ్ కంట్రోల్‌లో దూకుడు.. దొంగతనాల కేసుల్లో వేగవంతమైన దర్యాప్తు…!

 

రౌడీషీటర్లపై నిఘా.. చోరీ సొత్తు రికవరీలో ప్రత్యేక శ్రద్ధ..!

 

ఉత్తమ సేవకు పోలీస్ శాఖ ప్రశంసలు.. సీఐ విక్రమ్ సింహాకు ఉత్తమ సేవా పతకం..!

 

కర్నూలు క్రైమ్, ఆగస్టు 28 (సీమకిరణం న్యూస్):

 

నేరస్తులకు చెక్ పెట్టడంలో.. బాధితులకు అండగా నిలవడంలో.. కేసుల ఛేదనలో వేగం చూపించడంలో కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. సీఐ విక్రమ్ సింహా ఆధ్వర్యంలో పోలీసులు నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపడుతూ ప్రజల్లో భద్రతా భావాన్ని పెంచుతున్నారు. నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు, చైన్ స్నాచింగ్, బ్యాగ్ లిఫ్టింగ్ తదితర కేసులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నేరం జరిగిన వెంటనే స్పందించి సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలు, నిందితుల కదలికలను పరిశీలిస్తూ దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు.

 

దొంగతనం జరిగిందంటే.. రికవరీపై ప్రత్యేక దృష్టి..!

 

ఇటీవల నాలుగో పట్టణ పోలీసులు ఛేదించిన పలు కేసుల్లో భారీగా చోరీ సొత్తును రికవరీ చేశారు. ఒక కేసులో రూ.1.40 లక్షల నగదును స్వాధీనం చేసుకోగా, మరో కేసులో 15 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి ఆభరణాలను రికవరీ చేశారు. మరికొన్ని కేసుల్లో కూడా బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేశారు. కేసు నమోదు చేయడంతో తమ బాధ్యత పూర్తయిందని భావించకుండా.. నిందితులను గుర్తించడం, అరెస్ట్ చేయడం, చోరీ సొత్తును రికవరీ చేయడం వరకు పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.

 

రౌడీషీటర్లపై నిరంతర నిఘా..!

 

నేరాల నియంత్రణలో భాగంగా రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులపై ప్రత్యేక పర్యవేక్షణతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. పోలీసుల నిఘాతో నేరస్తుల్లో భయం.. సాధారణ ప్రజల్లో భరోసా కనిపిస్తోంది.

 

ఉత్తమ సేవకు గుర్తింపు..!

 

నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ విక్రమ్ సింహా సేవలకు పోలీస్ శాఖ నుంచి కూడా గుర్తింపు లభించింది. విధి నిర్వహణలో ప్రతిభ, నిబద్ధత, క్రమశిక్షణతో విశిష్ట సేవలు అందించినందుకు “ఉత్తమ సేవా పతకం” అందుకున్నారు. ఈ గుర్తింపు ఆయన వ్యక్తిగత ప్రతిభకు మాత్రమే కాకుండా, ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బంది సమష్టి కృషికి కూడా గుర్తింపుగా భావించవచ్చు.

 

 

బాధితులకు అండగా.. ప్రతి ఒక్కరికీ న్యాయం..!

 

పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలను శ్రద్ధగా విని, చట్టపరమైన పరిష్కారం చూపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ న్యాయం అందించాలనే లక్ష్యంతో పోలీసులు పనిచేస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.

 

సీఐ విక్రమ్ సింహా పనితీరుపై ప్రశంసలు…!

 

కేసుల దర్యాప్తులో వేగం, నేరస్తులపై నిఘా, చోరీ సొత్తు రికవరీ, బాధితులకు న్యాయం, సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ విధుల నిర్వహణ వంటి అంశాల్లో నాలుగో పట్టణ పోలీసులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.

 

నేరస్తులకు నాలుగో పట్టణం సింహస్వప్నం.. బాధితులకు మాత్రం భరోసా…!

ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, నేరాలను నియంత్రించేందుకు మరింత కఠినంగా వ్యవహరిస్తున్న నాలుగో పట్టణ పోలీసుల పనితీరుపై ప్రజల్లో సానుకూల స్పందన వ్యక్తమవుతోంది.

“ప్రజల భద్రతే ప్రథమ కర్తవ్యం.. నేరస్తులపై చట్ట ప్రకారం చర్యలు.. బాధితులకు న్యాయం” అనే లక్ష్యంతో నాలుగో పట్టణ సీఐ విక్రమ్ సింహా ముందుకు సాగుతున్నారు.