అమకతాడు టోల్ ప్లాజా వద్ద నిబంధనలు ఉల్లంఘించిన నాలుగు ఇన్నోవాలకు రూ.62,300 జరిమానా
డోన్ ప్రతినిధి, ఫిబ్రవరి 28, (సీమకిరణం న్యూస్) :
డోన్ ఆర్టీవో పరిధిలో శనివారం నిర్వహించిన సాధారణ తనిఖీల్లో అమకతాడు టోల్ ప్లాజా వద్ద కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక ఇన్నోవా వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా, డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. అనంతరం అదే సంస్థకు చెందిన మరొక ఇన్నోవా వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, ఆ వాహనానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రహదారి పన్ను మరియు చెల్లుబాటు అయ్యే పర్మిట్ లేవని గుర్తించారు. దీంతో సంబంధిత నిబంధనల ప్రకారం జరిమానా విధించారు. తదుపరి మరి రెండు ఇన్నోవా వాహనాలను ఆపేందుకు ప్రయత్నించగా, అవి కూడా ఆగకుండా వెళ్లిపోయాయి. అధికారులు వెంటనే ఆ వాహనాలను గుర్తించి పట్టుకుని చర్యలు చేపట్టారు. మొత్తం నాలుగు వాహనాలకు (KA04AF0417, KA04AE1179, KA04AF0416, KA04AF0237) కలిపి రూ. 62,300 జరిమానా విధించి, డోన్ ఆర్టీవో కార్యాలయానికి తరలించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు సరైన పర్మిట్ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచరిస్తే, ప్రమాదం సంభవించిన సందర్భంలో బీమా (ఇన్సూరెన్స్) వర్తించకపోవచ్చని అధికారులు హెచ్చరించారు. కాబట్టి వాహన యజమానులు, డ్రైవర్లు రవాణా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డోన్ ఎంవిఐ క్రాంతి కుమార్ సూచించారు.