Friday, March 6, 2026
ads
📄 ePaper
Homeరాజకీయంనగర సమగ్ర ప్రగతే లక్ష్యం : మంత్రి టీ.జీ.భరత్

నగర సమగ్ర ప్రగతే లక్ష్యం : మంత్రి టీ.జీ.భరత్

📰 Generate e-Paper Clip

నగర సమగ్ర ప్రగతే లక్ష్యం : మంత్రి టీ.జీ.భరత్

 

జాప్యమైన పనులు త్వరితగతిన పూర్తి

 

ట్రేడ్ లైసెన్స్ రుసుములు యథాతథం

 

తాగునీరు, వీధి కుక్కలపై చర్యలు

 

కర్నూలు ప్రతినిధి, ఫిబ్రవరి 06, (సీమకిరణం న్యూస్):

నగర సమగ్ర ప్రగతే లక్ష్యంగా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గుత్తేదారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీ.జీ.భరత్ సూచించారు. శుక్రవారం స్థానిక ఎస్బీఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో కమిషనర్ పి.విశ్వనాథ్, మున్సిపల్ అధికారులు, గుత్తేదారులతో వార్డుల వారీగా అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. గుత్తేదారుల వారీగా జాప్యమైన పనులను పరిశీలించిన మంత్రి నిర్దేశిత గడువులోపు పనులు పూర్తి చేయాలని, అవసరమైన చోట సమన్వయంతో సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో ఎలాంటి అలసత్వం సహించబోమని, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారులకు స్పష్టం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెంచిన ట్రేడ్ లైసెన్స్ రుసుములను పాత రుసుముల మేరకే వసూలు చేయాలని ఆదేశించారు. మున్సిపల్ దుకాణాల అద్దె బకాయిలను రాబట్టాలని సూచించారు. వీధి కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవడంతో పాటు సంతాన నియంత్రణ కేంద్రంలో రోజువారీ చికిత్స సామర్థ్యాన్ని 100 శునకాలకు పెంచాలని తెలిపారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ఎస్‌ఈ విష్ణుమూర్తి, డిసిపి వెంకటరమణ, ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగ ప్రసాద్ బాబు, కార్యదర్శి నాగరాజు, ఆర్వోలు జునైద్, వాజీద్, స్వర్ణలత, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, ఎంఈలు మనోహర్ రెడ్డి, గిరిరాజ్, డిఈఈలు, ఏఈలు, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular