ఆంధ్ర ప్రదేశ్
ఓయి-లింగారెడ్డి గజ్జల
వచ్చే ఖరీఫ్ సీజన్‌పై వరుణుడి కన్ను పడనుందా? వాతావరణ సంస్థల తాజా హెచ్చరికలు అన్నదాతల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో రానున్న నాలుగు నెలల పాటు ‘ఎల్‌నినో’ ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని, దీనివల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణను సిద్ధం చేసింది
రాష్ట్రంలో రానున్న ఖరీఫ్ సీజన్ గడ్డు పరిస్థితులను ఎదుర్కోనుంది. జూన్ నుండి సెప్టెంబర్ వరకు సాగే కీలకమైన పంట కాలంలో వర్షాలు ముఖం చాటేసే ప్రమాదం ఉందని వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావం వల్ల సగటు వర్షపాతంలో 12 శాతం వరకు తగ్గుదల ఉండవచ్చని అంచనా. ముఖ్యంగా జూన్ నెలలో 8.4%, జూలైలో అత్యధికంగా 25.4%, ఆగస్టులో 14.5% మేర వర్షాలు తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సాగు దెబ్బతినకుండా ఉండేందుకు ప్రభుత్వం మే 15వ తేదీ నుంచి కాలువల ద్వారా నీటిని విడుదల చేయాలని నిర్ణయించింది.

జిల్లాల వారీగా వర్షపాత అంచనాలు
వాతావరణ నివేదికల ప్రకారం.. కర్నూలు, నంద్యాల, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో నాలుగు నెలల పాటు వర్షాభావం తీవ్రంగా ఉంటుంది. కోనసీమ జిల్లాలో మూడు నెలల పాటు, అనంతపురం, శ్రీసత్యసాయి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు రెండు నెలల పాటు వానలు తక్కువగా కురుస్తాయి. మిగిలిన జిల్లాల్లోనూ ఏదో ఒక సమయంలో కరువు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖకు నివేదించింది.
ప్రత్యామ్నాయ సాగుపై దృష్టి:
వర్షాలు తక్కువగా ఉన్న తరుణంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు ‘సహజ సేద్యం’ మరియు ‘ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్’ (PMDS) విధానాలను ప్రోత్సహించాలని నిర్ణయించింది.
- పంటల మార్పిడి: వర్షాధారిత ప్రాంతాలు ఉల్లి, మిరప వంటి పంటల సాగును తగ్గించి, కరువును తట్టుకునే పంటల వైపు రైతులను మళ్లించాలని సూచించారు.
- నీటి నిర్వహణ: కాలువలు, చెరువుల్లో నీటి నిల్వలను అంచనా వేసి, తోటలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఉద్యానవన శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి.
- జాగ్రత్తలు: కర్నూలు, నంద్యాల జిల్లాల్లో నీటి లభ్యత ఉన్న చోట మాత్రమే టమాట సాగు చేయాలని, చిత్తూరు, విజయనగరం వంటి జిల్లాల్లో మామిడి తోటలకు కవర్లు కట్టే ప్రక్రియను అధికారులు చేపడుతున్నారు.
యంత్రాంగానిదే బాధ్యత..
కరువు ప్రభావిత మండలాల్లో ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యతను జిల్లా యంత్రాంగానికి అప్పగించారు. సాగునీరు అందుబాటులో ఉన్న చోటే పంటలు వేసుకునేలా రైతులకు ముందస్తు సమాచారం అందించాలని ప్రభుత్వం కల్పించింది. వాతావరణం అనుకూలించని తరుణంలో సాంకేతిక పరిజ్ఞానం, ముందస్తు ప్రణాళికలే అన్నదాతకు అండగా నిలుస్తున్నాయి.

