seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 7:24 am Digital Edition : SEEMA KIRANAM

తిరువీధి రమేష్ శెట్టికి మద్దతుగా బొమ్మన దశరథ రామిరెడ్డి ఇంటింటి ప్రచారం

తిరువీధి రమేష్ శెట్టికి మద్దతుగా బొమ్మన దశరథ రామిరెడ్డి ఇంటింటి ప్రచారం

 

గంగమ్మ గుడి నిర్మాణానికి హామీ..

 

 

గ్రామాభివృద్ధికి రమేష్ శెట్టిని గెలిపించాలని పిలుపు

 

 

కర్నూలు ప్రతినిధి, నవంబర్ 23,(సీమకిరణం న్యూస్): 

 

వెల్దుర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. సర్పంచ్ అభ్యర్థి తిరువీధి రమేష్ శెట్టికి మద్దతుగా ప్రముఖ నాయకుడు బొమ్మన దశరథ రామిరెడ్డి, ఆయన కుమారులు శ్రీకర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి తదితరులు వెల్దుర్తి పట్టణంలోని 2, 3 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలను నేరుగా కలుస్తూ రమేష్ శెట్టికి మద్దతు ఇవ్వాలని కోరారు.

 

గంగమ్మ గుడి నిర్మాణానికి భరోసా

 

ప్రచారంలో భాగంగా కుమ్మరి వీధిలో గంగమ్మ గుడి నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగు వీధి సంఘం సభ్యులు తమ వీధిలో గంగమ్మ గుడి నిర్మించాలని కోరగా, సర్పంచ్ అభ్యర్థి తిరువీధి రమేష్ శెట్టి సానుకూలంగా స్పందించారు. ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రస్తుతానికి తన సొంత ఖర్చులతో తాత్కాలిక రేకుల షెడ్డు నిర్మిస్తానని, అనంతరం గ్రామ పెద్దల సమక్షంలో శాశ్వత గంగమ్మ గుడి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహిళలు, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ గుడి నిర్మాణానికి ముందుకు రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

 

 

గ్రామాభివృద్ధికి రమేష్ శెట్టిని గెలిపించాలి : బొమ్మన దశరథ రామిరెడ్డి

 

 

ఈ సందర్భంగా బొమ్మన దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ, గ్రామ ప్రజలంతా ఐక్యంగా ఉండి మంచి మనసున్న వ్యక్తి తిరువీధి రమేష్ శెట్టిని సర్పంచ్‌గా గెలిపించాలని కోరారు. ఆయన నాయకత్వంలో ప్రభుత్వ సహకారంతో గ్రామంలో మౌలిక వసతులు, బోర్లు, ఇతర అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజల సమస్యలపై స్పందిస్తూ, ఆడబిడ్డల సెంటిమెంట్‌ను గౌరవించి గంగమ్మ గుడి నిర్మాణానికి ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. అలాగే వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్న సురేష్‌కు కూడా ఓటు వేసి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో గ్రామ పురవీధుల్లో ఎన్నికల ప్రచారం సందడిగా సాగింది. ఇంటింటి ప్రచారం ద్వారా రమేష్ శెట్టికి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.