ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-చంద్రశేఖర్ రావు
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం నాడు 67,952 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 27,414 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.97 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 నుండి 17 గంటల సమయం పట్టింది.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నేడు సమావేశం కాబోతోంది. దీనికి- చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షత వహించనున్నారు. పాలక మండలి సభ్యులు, టీటీడీ కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి ఇందులో పాల్గొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి అవసరమైన బడ్జెట్ అంచనాలను ఈ సమావేశం ఆమోదించనుంది. దీనితో పాటు శ్రీవారి ముడుపు పత్రం పథకానికి లాంఛనంగా ఆమోదం తెలియజేయనుంది.

నగదు రహిత విరాళాలను ప్రోత్సహించేందుకు శ్రీవారి ముడుపు పత్రం పథకం అందుబాటులోకి రానుంది. భక్తులు తమ కానుకలను హుండీలో సమర్పించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఈ వినూత్న రూపకల్పన రూపొందించిన టీటీడీ. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం డిజిటల్‌లో విరాళాలు చెల్లించి, అదే విలువ గల శ్రీవారి ముడుపు పత్రాన్ని పొందవచ్చు. దర్శన సమయంలో ఈ పత్రాన్ని ఆలయంలోని హుండీలో వేసి మొక్కులు చెల్లించుకోవచ్చు.
డిజిటల్ చెల్లింపుల యుగంలో ఈ ముడుపు పత్రం భక్తులకు ఎంతో సౌకర్యాన్ని కల్పిస్తుందని టీటీడీ భావిస్తోంది. నగదు తీసుకువెళ్లే శ్రమ, రిస్క్ నుంచి భక్తులకు విముక్తి లభిస్తుందని, మొత్తం ప్రక్రియ డిజిటల్‌గా పూర్తి చేయమని చెబుతోంది. ముడుపు పత్రాన్ని హుండీలో వేసిన వెంటనే, భక్తుల విరాళం లెక్కింపు ప్రక్రియలో నమోదు అవుతుంది. ఇది పూర్తి పారదర్శకంగా ఉంటుందని చెబుతోంది టీటీడీ. లక్ష రూపాయల వరకు ముడుపు పత్రాన్ని స్వామివారికి సమర్పించే అవకాశం ఉంది.
టీటీడీ ట్రస్ట్ సరళీకృత అన్నప్రసాదం విరాళ పథకానికి కూడా ఆమోదం తెలపనుంది. ఈ పథకంతో భక్తులు తమ స్థోమతకు తగ్గ చిన్న మొత్తాలు విరాళంగా ఇవ్వవచ్చు. నచ్చిన తేదీల్లో, ఇష్టమైన ఎంతమంది భక్తులకు అన్నప్రసాదం అందించాలో ఏంచుకునే సౌలభ్యం ఉంటుంది. ఈ ప్రక్రియ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జరుగుతుంది. ఈ అంశాలతో పాటు కీలక తీర్మానాలకు కూడా టీటీడీ ఆమోదముద్ర వేయనుంది.

